Friday, June 10, 2022

శ్రీకృష్ణ విజయము - ౫౬౪(564)

( శ్రుతదేవ జనకుల చరిత్రంబు ) 

10.2-1180-ఉ.
ఆ మునికోటికిన్ వినయ మారఁగ వందన మాచరించి, యా
తామరసాభలోచనుఁ, డుదారచరిత్రుఁడు, పాపగోత్ర సు
త్రాముఁడు, భక్తలోకశుభదాయకుఁ డైన రమేశు, సద్గుణ
స్తోముని పాదపద్మములు సోఁకఁగ మ్రొక్కి వినమ్రులై తగన్.
10.2-1181-చ.
కరములు మోడ్చి యో! పరమకారుణికోత్తమ! నీవు నీ మునీ
శ్వరులును మద్గృహంబునకువచ్చి మముం గృపసేసి యిచ్చటం
గర మనురక్తిఁ బూజనలు గైకొనుఁ డంచు నుతించి వేఁడ నా
హరి మనమందు వారివినయంబుల కెంతొ ప్రమోద మందుచున్.

భావము:
వారిద్దరూ వచ్చిన మునీంద్రు లందరికీ వినయంగా నమస్కారాలు చేసారు. పద్మాక్షుడూ, ఉదారచరిత్రుడూ, పాపాలనే పర్వతాల పాలిటి ఇంద్రునివంటివాడూ, భక్తులకు శుభాలను కలిగించేవాడూ, సద్గుణాలకు నిలయుడూ, సాక్షాత్తు లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుని పాదపద్మాలకు వినమ్రులై ప్రణామాలు చేశారు. “ఓ దయాసాగరా! నీవూ ఈ మునీశ్వరులూ మా గృహానికి వచ్చి మమ్ము అనుగ్రహించాలి మా పూజలు మీరు స్వీకరించాలి.” అని బహుళాశ్వ శ్రుతదేవులు చేతులు జోడించి కృష్ణుడిని ప్రార్థించారు, వారి వినయ స్వభావానికి శ్రీకృష్ణుడు ఎంతో సంతోషించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=82&Padyam=1181

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :  

No comments: