Tuesday, February 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౧(471)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1009-వ.
అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున. 

భావము:
గోవిందుడు సకల ప్రాణుల మనసులోని భావాలను ఎరిగిన వాడు, కనుక సాభిప్రాయంగా కుచేలుడు పలికిన ఈ పలుకులలోని అంతర్యాన్ని గ్రహించాడు. మందస్మిత వదనారవిందుడై కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1009 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Monday, February 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౦(470)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1005-క.
కని గారవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
మనమునఁ దలఁతే" యటంచు మఱియుం బలికెన్.
10.2-1006-వ.
“అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె.
10.2-1007-క.
"వనజోదర! గురుమందిర
మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం
పని పను లెవ్వియుఁ గలవే?
విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా! 

భావము:
ఇలా దీవించి, పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలచుకుంటూ ఉంటావా?” అని కుచేలునితో శ్రీకృష్ణుడు మరల ఇలా అన్నాడు.
“పుణ్యాత్మా! అప్పుడు, మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా?” ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తుచేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. “ఓ సచ్చరితుడా! దామోదరా! గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉండనీ కాని నా మాట విను. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1006 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Saturday, February 5, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౯(469)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1003-క.
అప్పుడు సాందీపని మన
చొప్పరయుచు వచ్చి వానసోఁకునను వలిం
దెప్పిఱిలుటఁ గని ఖేదం
బుప్పతిలం బలికె "నకట! యో! వటులారా!
10.2-1004-చ.
కటకట! యిట్లు మా కొఱకుఁగాఁజనుదెంచి మహాటవిన్ సము
త్కటపరిపీడ నొందితిరి; గావున శిష్యులు! మీ ఋణంబు నీఁ
గుట కిది కారణంబు సమకూరెడిఁ బో; యిట మీఁద మీకు వి
స్ఫుట ధనబంధుదారబహుపుత్త్ర విభూతి జయాయురున్నతుల్‌. " 

భావము:
అప్పుడు, మన గురువుగారైన సాందీపని మహర్షి మనలను వెదుక్కుంటూ వచ్చాడు. వానలో తడిసి చలికి గజగజమని వణుకుతున్న మనల్ని చూసి విచారం పొంగిపొరలగా ఇలా అన్నాడు. “అమ్మో! పిల్లల్లారా! మాకోసం అడవికి వచ్చి అయ్యయ్యో మీరు ఎంత ఇబ్బంది పడ్డారు. కనుక, ఓ శిష్యులారా! మీరు మీ గురుఋణం తీర్చుకున్నారు. మీకు ధన దార బహు పుత్ర సంపదలూ దీర్ఘాయురున్నతులూ విజయశ్రీలు చేకూరగలవు.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1004 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Friday, February 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౮(468)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1002-క.
తెలతెలవాఱెడి వేళం
గలకల మని పలికెఁ బక్షిగణ మెల్లెడలన్
మిలమిలని ప్రొద్దుపొడువున
ధళధళ మను మెఱుఁగు దిగ్వితానము నిండెన్. 

భావము:
ఇంతలో తెలతెల్లగా తెల్లవారింది. పక్షుల కలకలారావాలు వినబడుతున్నాయి. మిలమిల కాంతులు పరచుకుంటున్నాయి. సకల దిక్కుల లోనూ తళతళలాడుతూ ఉదయకాంతులు నిండాయి. 

ఈ పద్యాన్ని పోతనగారు “తెలతెల”, “కలకల”, “మిలమిల”, “ధళధళ” జంటపదాలతో వేసిన వృత్త్యనుప్రాసము అద్భుతంగా అలంకరించారు. అర్థభేదం, శబ్దభేదం లేకుండా అవే పదాలు తత్పర్య భేదం కలిగి తిరిగి అవ్యవధానంగా (ఎడం లేకుండా) ప్రయోగిస్తే “వృత్త్యనుప్రాససాలంకారము” అంటారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1002 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Thursday, February 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౭(467)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1000-తే.
బయలు గొందియుఁ బెను మిఱ్ఱుపల్లములును
రహిత సహితస్థలంబు లేర్పఱుపరాక
యున్న యత్తఱి మనము నొండొరుల చేతు
లూతఁగాఁ గొని నడచుచు నుండునంత.
10.2-1001-క.
బిసబిస నెప్పుడు నుడుగక
విసరెడి వలిచేత వడఁకు విడువక మనముం
బస చెడి మార్గముఁ గానక
మసలితి మంతటను నంశుమంతుఁడు పొడిచెన్. 

భావము:
త్రోవలూ డొంకలూ మిట్ట పల్లాలూ కనపడకుండా వాననీరు కప్పివేసింది; ఒకరి చేతిని ఒకరం ఊతగా పట్టుకుని మనం ఆ అడవిలో దారి కానక తిరిగాము. తీవ్రంగా వీచే గాలులకు మనం విపరీతంగా వణకసాగాం; మనం ఏం చేయలో తోచక, దిక్కూ తెన్నూ తెలియక అడవిలో తెగ తిరిగాము; అప్పుడు, ఎట్టకేలకు సూర్యోదయం అయింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1001 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Wednesday, February 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౬(466)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-999-సీ.
ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత;
పటల సంఛన్నాభ్రభాగ మగుచుఁ
జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నా;
నావిధ జంతుసంతాన మగుచుఁ
జండ దిగ్వేదండ తుండ నిభాఖండ;
వారిధారాపూర్ణ వసుధ యగుచు
విద్యోతమానోగ్రఖద్యోత కిరణజి;
ద్విద్యుద్ధ్యుతిచ్ఛటావిభవ మగుచు
10.2-999.1-తే.
నడరి జడిగురియఁగ నినుఁ డస్తమింప
భూరినీరంధ్రనిబిడాంధకార మేచి
సూచికాభేద్యమై వస్తుగోచరంబు
గాని యట్లుండ మనము న వ్వానఁ దడిసి. 

భావము:
పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి; సుడిగాలులు మహా వేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి; వర్షధారలు దిగ్గజాలతొండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి; మెరుపులు మిరుమిట్లు గొలిపాయి; వాన జడి పెరిగింది; సూర్యుడు అస్తమించాడు; వర్షం ఆగలేదు; చీకట్లు దట్టంగా వ్యాపించి, కంటికి ఏమీ కనపడటం లేదు; అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=999 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


Monday, January 31, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౫(465)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-998-వ.
అదియునుం గాక, సకల భూతాత్మకుండ నైన యేను దపోవ్రత యజ్ఞ దాన శమ దమాదులచేత సంతసింపను; గురుజనంబులఁ బరమభక్తి సేవించువారలం బరిణమింతు” నని చెప్పి మఱియు “మనము గురుమందిరమున నున్న యెడ నొక్కనాఁడు గురుపత్నీ నియుక్తులమై యింధనార్థం బడవికిం జనిన నయ్యవసరంబున. 

భావము:
అంతే కాకుండా, సకల భూతాలలో ఆత్మగా ఉండు నేను తపోదానయజ్ఞాదులవల్ల సంతోషించను భక్తితో గురువును సేవించేవారిని ప్రేమిస్తాను.” ఇలా పలికి శ్రీకృష్ణుడు కుచేలుడితో మళ్ళీ ఇలా పలికాడు. “మనం గురువు గారి ఆశ్రమంలో ఉన్న దినాలలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞానుసారం కట్టెలు తేవడానికి అడవికి వెళ్ళాము. గుర్తుంది కదూ. ఆ సమయంలో... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=998 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :