10.2-1005-క.
కని గారవించి యాయన
మనలం దోడ్కొనుచు నాత్మమందిరమునకుం
జనుదెంచుట లెల్లను నీ
మనమునఁ దలఁతే" యటంచు మఱియుం బలికెన్.
10.2-1006-వ.
“అనఘ! మన మధ్యయనంబు సేయుచు నన్యోన్య స్నేహ వాత్సల్యంబులం జేయు కృత్యంబులు మఱవవు గదా!” యని యవి యెల్లం దలంచి యాడు మాధవు మధురాలాపంబులు విని యతనిం గనుంగొని కుచేలుం డిట్లనియె.
10.2-1007-క.
"వనజోదర! గురుమందిర
మున మనము వసించునాఁడు ముదమునఁ గావిం
పని పను లెవ్వియుఁ గలవే?
విను మవి యట్లుండనిమ్ము విమలచరిత్రా!
భావము:
ఇలా దీవించి, పిమ్మట గురువు సాందీపని వాత్సల్యంతో మనలను తన ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఇవన్నీ నీవు తలచుకుంటూ ఉంటావా?” అని కుచేలునితో శ్రీకృష్ణుడు మరల ఇలా అన్నాడు.
“పుణ్యాత్మా! అప్పుడు, మనం చదువుకుంటూ అన్యోన్య స్నేహవాత్సల్యాలతో మెలగిన తీరులు నీవు మర్చిపోలేదు కదా?” ఈ విధంగా శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి ముచ్చటలను గుర్తుచేసుకుంటూ పలికిన మధుర వచనాలను విని కుచేలుడు ఉప్పొంగిపోతూ ఇలా అన్నాడు. “ఓ సచ్చరితుడా! దామోదరా! గురువుగారి ఆశ్రమంలో సంతోషంతో మనం చేయని పనులు ఏమైనా అసలు ఉన్నాయా? అది అలా ఉండనీ కాని నా మాట విను.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1006
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment