Tuesday, February 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౭౧(471)

( గురుప్రశంస చేయుట ) 

10.2-1009-వ.
అని సాభిప్రాయంబుగాఁ బలికిన పలుకులు విని సమస్త భావాభిజ్ఞుండైన పుండరీకాక్షుండు మందస్మితవదనారవిందుం డగుచు నతనిం జూచి “నీవిచ్చటికి వచ్చునప్పుడు నాయందుల భక్తింజేసి నాకు నుపాయనంబుగ నేమి పదార్థంబు దెచ్చితి? వప్పదార్థంబు లేశమాత్రంబైనఁ బదివేలుగా నంగీకరింతు; నట్లుగాక నీచవర్తనుండై మద్భక్తిం దగులని దుష్టాత్ముండు హేమాచలతుల్యంబైన పదార్థంబు నొసంగిన నది నా మనంబునకు సమ్మతంబు గాదు; కావున. 

భావము:
గోవిందుడు సకల ప్రాణుల మనసులోని భావాలను ఎరిగిన వాడు, కనుక సాభిప్రాయంగా కుచేలుడు పలికిన ఈ పలుకులలోని అంతర్యాన్ని గ్రహించాడు. మందస్మిత వదనారవిందుడై కుచేలుడితో “నీ విక్కడికి వస్తూ నా కోసం ఏమి తెచ్చావు? ఆ వస్తువు లేశమైనా పదివేలుగా స్వీకరిస్తాను. నాపై భక్తి లేని నీచుడు మేరుపర్వత మంత పదార్థం ఇచ్చినా, అది నాకు అంగీకారం కాదు. అందుచేత... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=72&Padyam=1009 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: