Wednesday, February 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౬(466)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-999-సీ.
ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత;
పటల సంఛన్నాభ్రభాగ మగుచుఁ
జటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నా;
నావిధ జంతుసంతాన మగుచుఁ
జండ దిగ్వేదండ తుండ నిభాఖండ;
వారిధారాపూర్ణ వసుధ యగుచు
విద్యోతమానోగ్రఖద్యోత కిరణజి;
ద్విద్యుద్ధ్యుతిచ్ఛటావిభవ మగుచు
10.2-999.1-తే.
నడరి జడిగురియఁగ నినుఁ డస్తమింప
భూరినీరంధ్రనిబిడాంధకార మేచి
సూచికాభేద్యమై వస్తుగోచరంబు
గాని యట్లుండ మనము న వ్వానఁ దడిసి. 

భావము:
పెద్ద పెద్ద ఉరుములతో ఆకాశం అంతా భీకరంగా కారుమబ్బులు ఆవరించాయి; సుడిగాలులు మహా వేగంతో వీచి అడవి జంతువులను ఎగరగొట్టసాగాయి; వర్షధారలు దిగ్గజాలతొండా లంత పరిమాణంతో భూమిపై వర్షించాయి; మెరుపులు మిరుమిట్లు గొలిపాయి; వాన జడి పెరిగింది; సూర్యుడు అస్తమించాడు; వర్షం ఆగలేదు; చీకట్లు దట్టంగా వ్యాపించి, కంటికి ఏమీ కనపడటం లేదు; అలాంటి జడివానలో మనం తడిసి ముద్దయ్యాము. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=999 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: