Tuesday, September 7, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౧(331)

( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-680-క.
నరవరుల దూతయును ముర
హరుచే నభయప్రదాన మంది ధరిత్రీ
వరులకడ కేగి పద్మో
దరు వచనము సెప్పి సమ్మదంబునఁ దేల్చెన్.
10.2-681-వ.
అంతఁ గృష్ణుండు నిజకాంతాతనయ బంధు సుహృజ్జన సమేతుండై కదలి చనునెడ.
10.2-682-చ.
కటపటరత్నకంబళనికాయకుటీరము లుల్లసిల్ల ను
త్కటపటుచామరధ్వజ పతాక కిరీట సితాతపత్త్ర వి
స్ఫుట ఘనహేతిదీధితి నభోమణిఁ గప్పఁగఁ దూర్యఘోషముల్‌
చటులతిమింగిలోర్మిరవసాగరఘోషము నాక్రమింపఁగన్. 

భావము:
బంధీలుగా ఉన్న రాజుల దూతగా వచ్చిన బ్రాహ్మణుడు కూడ శ్రీకృష్ణునిచే అభయప్రధానం అందుకుని, తిరిగి ఆ రాజుల వద్దకు వెళ్ళి వాసుదేవుడి వచనాలు వారికి వినిపించి వారిని సంతోష పెట్టాడు. అటు పిమ్మట శ్రీకృష్ణుడు తన భార్యాపుత్రులతో బంధుమిత్రులతో కలసి ఇంద్రప్రస్థనగరానికి బయలుదేరాడు. ఆ సమయంలో మార్గమంతటా రత్నకంబళ్ళతో నిండిన పటకుటీరాలు విడిశాయి. వింజామరలూ విజయధ్వజాలూ విలసిల్లాయి. కిరీటాల నిగనిగలూ, వెల్లగొడుగుల ధగధగలూ. ఆయుధాల తళతళలూ సూర్యూడిని కప్పివేశాయి. మంగళవాద్యాల ధ్వనులు సముద్ర ఘోషాన్ని, తిమింగలాల ఘోషాన్ని అధిగమించాయి. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=682 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, September 6, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౩౦(330)


( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-676-క.
అసమాస్త్రుఁడు పులు గడిగిన
కుసుమాస్త్రములను హసించు కోమలతనువుల్‌
మిసమిస మెఱవఁగ వేశ్యా
విసరము దాసీజనంబు విభవ మెలర్పన్.
10.2-677-ఆ.
హరుల వేసడములఁ గరులను నెక్కి తో
నరుగుదేర బహువిధాయుధములు
దాల్చి సుభటకోటి దగిలి రా నంతఃపు
రాంగనలు సితాంబుజాక్షు కడకు.
10.2-678-వ.
వచ్చి రంత.
10.2-679-క.
నారదుని మాధవుఁడు స
త్కారంబున వీడుకొలుప నతఁడును హృదయాం
భోరుహమునఁ గృష్ణునకును
వారక మ్రొక్కుచును వెస దివంబున కరిగెన్. 

భావము:
పూవిల్తుని స్వచ్ఛమైన పూలబాణాలవంటి మిసమిసలాడే మెత్తని మేనులతో మెఱసిపోయే ఆటవెలదులూ, దాసీ సమూహాలూ వైభవంగా తోడు వస్తుండగా ఆవిధంగా దాసదాసీ జనాలు అందరూ గుఱ్ఱాలు, కంచర గాడిదలు, ఏనుగులు ఎక్కి కూడా వస్తున్నారు. రకరకాల ఆయుధాలు ధరించిన భటులు వెంట వస్తున్నారు. ఆ విధంగా సకల వైభవాలతో అంతఃపుర సుందరాంగులు తెల్ల తామరల వంటి కన్నులు ఉన్న గోవిందుడి దగ్గరకు వచ్చారు. అలా తన అంతఃపుర కాంతులు వస్తున్న సమయంలో నారదమహర్షిని శ్రీకృష్ణుడు గౌరవించి సాగనంపాడు. ఆ మహర్షి మనస్సులో మాధవునకు మాటిమటికీ నమస్కారాలు చేస్తూ స్వర్గలోకంవైపు వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=679 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Sunday, September 5, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౯(329)


( ధర్మజు రాజసూయారంభంబు ) 

10.2-673-వ.
వికచమరంద నవీన సౌరభ లస-
  న్మందార కుసుమదామములు దుఱిమి
చారు సుగంధ కస్తూరికా ఘనసార-
  మిళిత చందనపంక మెలిమి నలఁది
కనక కుండల రణత్కంకణ నూపుర-
  ముద్రికాభూషణములు ధరించి
యంచిత ముక్తాఫలాంచల మృదుల ది-
  వ్యాంబరములు సెలువారఁ గట్టి
10.2-674.1-తే.
యర్ధచంద్రుని నెకసక్కె మాడునట్టి
యలికఫలకలఁ దిలకము లలరఁ దీర్చి
పెంపు దీపింప నుడురాజబింబముఖులు
నవచతుర్విధ శృంగార మవధరించి.
10.2-675-తే.
జలజలోచను కడకు నుత్కలికతోడఁ
దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ
గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర
కలితులై పౌరులను నెడగలుగ జడియ. 

భావము:
శ్రీకృష్ణుడి అంతఃపురకాంతలు మకరందాలుచిందుతూ సుగంధాలు వెదజల్లుతున్న వికసించిన మందారపూల హారాలు ధరించి; పరిమళభరితమైన కస్తూరి పచ్చకర్పూరంతో మేళవించిన మంచిగంధం మైపూతలు పూసుకుని; కంకణాలూ, కడియాలూ, ఉంగరాలూ, కుండలాలూ మున్నగు బంగారు ఆభరణాలు ధరించి; అంచులలో ముత్యాలు అలంకరించిన మెత్తని పట్టుచీరలు కట్టుకుని; అర్ధచంద్రబింబం వంటి నుదుట తిలకం పెట్టుకుని; ఎన్నో రకాల అలంకారాలతో నళినలోచనుని దగ్గరకు వచ్చారు. ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు.


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=675 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, September 4, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౮(328)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-669-సీ.
తరల విచిత్రక స్థగిత ప్రభావలిఁ-
  దనరారు గరుడకేతనము వెలుఁగఁ
గాంచన చక్ర సంఘటిత ఘంటా ఘణ-
  ఘణ నినాదముల దిక్కరులు బెదర
సలలిత మేఘ పుష్పక వలాహక శైబ్య-
  సుగ్రీవ తురగవిస్ఫురణ దనర
బాలసూర్యప్రభా భాసమానద్యుతి-
  దిగ్వితానం బెల్ల దీటుకొనఁగఁ
10.2-669.1-తే.
బ్రకటరుచి నొప్పు తేరు దారుకుఁడు దేర
నెక్కి వెడలెడు నపుడు పెంపెనయఁ జెలఁగె
శంఖ కాహళ పటహ నిస్సాణ డిండి
మాది రవములు భరితదిగంతములుగ.
10.2-670-క.
మనుజేశ్వరునకుఁ దాలాం
కునకును గురువృద్ధజనులకునుఁ జెప్పి ప్రియం
బున ననుపఁ గాంచనస్యం
దన సామజ వాజి భటకదంబము గొలువన్.
10.2-671-తే.
వంది మాగధ సూత కైవారరవము
వసుమతీసురకోటి దీవనల మ్రోఁత
లనుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర
జాలములనుండి ముత్యాలశాస లొలుక.

భావము:
స్వచ్చంగా రచింపబడిన తళతళ ప్రకాశించే గరుడధ్వజంతోనూ దిగ్గజాలను సైతం బెగ్గడిల్ల చేసే బంగారు చక్రాలకు కట్టిన గంటల గణగణ శబ్దాలతోనూ మంచి వేగం కలిగిన మేఘపుష్పం, వలాహకం, శైబ్యం, సుగ్రీవం అనే నాలుగు గుఱ్ఱాలతోనూ ఉదయసూర్యుని కాంతిని ధిక్కరించే దిగంత విశ్రాంత కాంతులతోనూ విలసిల్లే రథాన్ని దారకుడు సిద్దంచేసి తీసుకు వచ్చాడు. శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించి బయలుదేరాడు. ఆ సమయంలో శంఖ బాక తప్పెట నిస్సాణ మున్నగు వాద్యాల శబ్దాలు నలుదెసలా నిండాయి. ఉగ్రసేన మహారాజుకీ, అన్న బలరాముడికీ, గురువులకూ, పెద్దలు అందరికీ చెప్పి, ఆదరంతో వారు తనను సాగనంపగా చతురంగబల సమేతుడై శ్రీకృష్ణుడు బయలుదేరాడు. వందిమాగధుల, సూతజనుల పొగడ్తలూ; బ్రాహ్మణుల ఆశీర్వాదాలూ అతిశయిస్తుండగా; పుర స్త్రీలు మేడలమీద నుంచి ముత్యాల అక్షతలు చల్లుతుండగా; శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=668

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Friday, September 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౭(327)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-668-వ.
అని సర్వజ్ఞుండైన హరి యజ్ఞుండ పోలెఁ దన్ను నడిగినఁ బురుషోత్తముని భాషణంబులకు మనంబున సంతసిల్లి, యతని పాదంబులు దన మనంబున నిడికొని, “వృద్ధానుమతంబుగా నా యెఱింగిన తెఱంగు విన్నవించెద నవధరింపుము; దేవా! దేవముని చెప్పినట్లు భవదీయ భక్తుండైన యుధిష్ఠిరు యాగపాలనంబు సేయం గైకొనుట కార్యం; బదియునుంగాక నిఖిల దిగ్విజయ మూలంబగు రాజసూయ కృత్యంబునందు జరాసంధ మర్దనంబును, నతనిచే బద్ధులైన రాజులం గారాగృహ విముక్తులం గావించుటయుం జేకూరు; నదియునుం గాక నాగాయుతసత్త్వుండును, శతాక్షౌహిణీ బలాన్వితుండును నగు మాగధుని వధియింప మన ప్రభంజననందనుండు గాని యొండొరులు సమర్థలుగా; రట్లగుట నతండు భూసురు లేమి గోరిన, నయ్యర్థంబు వృథసేయక యిచ్చుం; గావున గపటవిప్రవేషంబునం జని యా జరాసంధుని నాహవ భిక్షవేఁడి, భవత్సన్నిధానంబున నప్పవమానతనయుం డతని వధియించునట్టి కార్యంబుసేఁత బహుళార్థసాధనంబగు” నని పలికిన నారదుండును యాదవ జనంబులును సభ్యులునుం బొగడి; రంత.

భావము:
ఇలా సర్వజ్ఞుడైన కృష్ణుడు అమాయకుడిలా ఉద్ధవుడిని ప్రశ్నించాడు. అందుకు ఉద్ధవుడు ఎంతో సంతోషించి, శ్రీకృష్ణుడి పాదాలను మనసులో ధ్యానించుకుని ఇలా అన్నాడు. “దేవా! పెద్దలు సమ్మతించేలా నాకు తెలిసిన విధానం వివరిస్తాను. చిత్తగించండి నారదుడు చెప్పినట్లుగా మీ భక్తుడైన ధర్మరాజు చేయబోయే యజ్ఞాన్ని రక్షించడం ఆవశ్యం కర్తవ్యం. సమస్త దిక్కులనూ జయించడానికి మూలమైన రాజసూయయాగ సందర్భంలో జరాసంధుణ్ణి సంహరించటం. వాడిచేత బంధించబడ్డ రాజులను చెరనుండి విముక్తులను చేయడం కూడా సిద్ధిస్తుంది. అంతేకాకుండా, పదివేల ఏనుగుల బలం కలవాడూ నూరు అక్షౌహిణుల సైన్యంకలిగిన జరాసంధుణ్ణి చంపడానికి మన భీమసేనుడు తప్ప మరింకెవరూ సమర్థులు కారు. బ్రాహ్మణులు ఏమికోరినా జరాసంధుడు కాదనకుండా ఇస్తాడు. కాబట్టి, కపట బ్రాహ్మణవేషాలతో వెళ్ళి ఆజరాసంధుణ్ణి యుద్ధభిక్ష యాచించి మన భీమసేనుడి ద్వారా వాడిని సంహరించడం జరిగితే సకల ప్రయోజనాలను సాధించినట్లు అవుతుంది.” ఇలా పలికిన ఉద్ధవుడి మాటలు విని నారదుడూ యాదవులూ అందరూ పొగిడారు. ఆ సమయంలో.....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=668

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, September 2, 2021

శ్రీకృష్ణ విజయము - ౩౨౬(326)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-664-క.
ఆ మఖవేళ సమస్త ధ
రామండలిఁ గల్గు మేటిరాజులు మౌని
స్తోమంబును భవదీయ మ
హామహిమముఁ జూచి సత్కృతార్థతఁ బొందన్."
10.2-665-క.
కల" రని చెప్పిన నమ్ముని
పలుకులకు ముదంబు నొంది పంకజనాభుం
డెలనవ్వు మొగమునకుఁ జెలు
వొలయఁగఁ బాటించి యుద్ధవున కిట్లనియెన్.
10.2-666-క.
"ఉద్ధవ! మహిత వివేక స
మిద్ధవచోవిభవ! కార్య మేగతి నడచున్
వృద్ధవరానుమతంబుగ
బోద్ధవ్యము గాఁగఁ జెప్పు పురుషనిధానా!
10.2-667-తే.
అనఘచారిత్ర! నీవు మా యక్షియుగము
వంటివాఁడవు మనకు నవశ్య మగుచుఁ
జేయఁ దగినట్టి కార్యంబుఁ జెప్పు నీవు
ఏమి పంచినఁ గావింతు నిద్ధచరిత! "

భావము:
ధర్మరాజు చేసే యజ్ఞ సందర్భంగా భూమండలంమీద ఉన్న మహారాజులు మునీశ్వరులూ అందరూ నీ మహామహిమను దర్శించి ధన్యులు అవుతారు.” ఇలా పలికిన నారదుడి మాటలు వినిన శ్రీకృష్ణుడు సంతోషించి చిరునవ్వుతో ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “వివేక, వాక్చాతుర్యాలు కల ఉద్ధవా! పెద్దల సమ్మతించే సరళిలో ఆలోచించి ప్రస్తుత కర్తవ్యం ఏమిటో బాగా అర్థం అయ్యేలా వివరించు. ఓ పుణ్యాత్ముడా! నీవు మాకు మంత్రాంగము చెప్పువాడవు. ఇప్పుడు మనం చేయవలసిన, చేయతగిన కార్యాన్ని వెల్లడించు. నీవు ఎలా చెప్తే నేను అలాగే చేస్తాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=667

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౩౨౫(325)

( ధర్మజు రాజసూయారంభంబు )

10.2-661-సీ.
"అయినను వినిపింతు నవధరింపుము దేవ!-
  పాండుతనూజుండు పారమేష్ఠ్య
కామానుమోదియై కావింప నున్నాఁడు-
  రాజసూయమహాధ్వరంబు నిష్ఠ
ఠవణింప లోకవిడంబనార్థము గాక-
  పరికింపఁ దన కాత్మబంధువుఁడవు,
భక్తవత్సలుఁడవు, పరమపూరుషుఁడవు-
  యజ్ఞరక్షకుఁడవు, యజ్ఞభోక్త
10.2-661.1-తే.
వగు భవత్సేవ చాలదే సుగతి వడయ?
నైన నీ మేనబావ ధర్మాత్మజుండు
అతని యజ్ఞంబు రక్షింప నంబుజాక్ష!
వలయు విచ్చేయు మచటికి వలను మెఱసి.
10.2-662-క.
నీ పేరు వినిన నొడివినఁ
బాపంబులు దూలిపోవు పద్మాక్ష! జగ
ద్దీపక! నీ దర్శనమున
నేపారవె భక్తజనుల కిహపరసుఖముల్‌.
10.2-663-మ.
భవదీయోజ్జ్వలకీర్తి దిగ్వితతులన్ భాసిల్లు యుష్మత్పదో
ద్భవనైర్మల్యజలంబు లుత్కలికఁ బాతాళంబునం బాఱు భో
గవతీ నామమునం దనర్చి ధరణిం గంగానదీరూపమై
దివి మందాకినియై జగత్త్రయమునం దీపించుఁ గాదే? హరీ!

భావము:
“ఓ కృష్ణమహాప్రభు! కమలాక్షా! నీకు తెలియనిది ఏమీ లేకపోయినా, ఒక విషయం విన్నవిస్తాను, విను. ధర్మరాజు బ్రహ్మలోకమును ఆశించి రాజసూయయాగం చేయబోతున్నాడు. పరికించి చూస్తే, భక్తవత్సలుడవూ; పరమపురుషుడవూ; రక్షకుడవూ; యజ్ఞభోక్తవూ; ఫలప్రదాతవూ; ఆత్మబంధుడవూ అయిన నీ సేవ చాలదా సమస్త సౌభాగ్యాలు పొందటానికి. అయినా అతడు యజ్ఞంచేయాలని అనుకోవడం లోకాచారాన్ని అనుకరించం కోసమే తప్ప మరొకటి కాదు. నీ మేనబావ ధర్మజుడు. ఆయన చేయబోయే యజ్ఞాన్ని రక్షించడానికి నీవు రావలసి ఉంది. ఓ కలువల వంటి కన్నులున్న కన్నయ్యా! విశ్వజ్యోతీ! నీ నామస్మరణం చేసినా, విన్నా పాపాలు అన్నీ తొలగిపోతాయి. నీ దర్శనమాత్రం చేతనే భక్తలకు ఇహపరసౌఖ్యాలు సంసిద్ధిస్తాయి. శ్రీకృష్ణా! నీ కీర్తిదిగంతాలను ప్రకాశింపచేస్తుంది. నీ పాదాలనుండి ప్రభవించిన పవిత్రజలం పాతాళంలో భోగవతి అనే పేరుతోనూ, భూలోకంలో గంగానదీ రూపంతోనూ, స్వర్గంలో మందాకినీ నామంతోనూ ప్రవహిస్తూ ముల్లోకాలలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=53&Padyam=663

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :