Thursday, August 30, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 3

10.1-432-వ.
అంత నొక్కనాడు యమునాతీరంబున నా కుమారులు గోపకుమారులుం దారును గ్రేపుల మేప నొక్క రక్కసుండు క్రేపు రూపున వచ్చి వారల హింసింపం దలంచి.
10.1-433-క.
క్రేపుల యఱ్ఱులు నాకుచుఁ 
గ్రేపులలో నిదియె మంచి క్రేపనఁగఁ గడుం
జూపట్టి భక్త సంగతిఁ 
గ్రేపై చనువాని మ్రోలఁ గ్రేపై తిరిగెన్.


భావము:
ఒకరోజు బలరామకృష్ణులు యమునానదీతీరాన గోపాలకులతో కలసి గోవత్సాలను మేపుతూ ఉండగా ఒక రాక్షసుడు వారిని చంపాలని వచ్చి తాను కూడా ఒక కోడెదూడ రూపం ధరించాడు. వాడు దూడలలో దూడ రూపం దాల్చి వాటితో కలసిపోయి మిగిలిన దూడల మెడలు నాకుతూ; ఉన్న వాటిలో ఇదే మంచి దూడ అన్నట్లు సంచరించాడు. భక్తుల వెంట దూడవలె సంచరించే కృష్ణుని వెనుక ఆ రాక్షసుడు దూడ రూపంలో తిరుగసాగాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Sunday, August 26, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 2

10.1-429-వ.
ఇట్లు బృందావనంబు చెంది, కొంత కాలంబునకు రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడుకొని వేడుక లూదుకొన దూడలఁ గాచుచు.
10.1-430-సీ.
వేణువు లూఁదుచు వివిధ రూపములతో; 
గంతులు వైతురు గౌతుకమున; 
గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని; 
పరవృషభము లని ప్రతిభటింతు; 
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జలు; 
మొఱయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి; 
వేటు లాడుదురు ప్రావీణ్య మొప్ప;
10.1-430.1-తే.
వన్య జంతు చయంబుల వానివాని
పదురు పదురుచు వంచించి పట్టఁబోదు; 
రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు; 
రా కుమారులు బాల్యవిహారు లగుచు.

భావము:
ఇలా బృందావనం చేరిన కొన్నాళ్ళ పిమ్మట, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలసి ఆనందంగా దూడలను కాయసాగారు.
ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గెంతులు వేయసాగారు; పెద్దపెద్ద కంబళ్ళతో వృషభాలరూపాలు తయారుచేసి, వాటిని శత్రు వృషభాలు అని వాటితో యుద్ధం చేయసాగారు; గుడ్డలతో బొమ్మలుచేసి వాటిని గట్టిగా తన్నుతుండేవారు, అలా కాలిగజ్జెలు ఘల్లుఘల్లు మంటూ మ్రోగసాగాయి; పందాలు వేసుకుని మరీ పండ్లగుత్తులను రాళ్ళతో కొడుతూ ఉంటారు; అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువులు దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు. తామరపూల కొలనులలో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇలా ఆ రాకుమారులు గోపబాలకులై బాల్యక్రీడలలో చరించసాగారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=61&padyam=430

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

Friday, August 24, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 1

10.1-427-వ.
అప్పుడు రోహిణీయశోద లేక రథంబునఁ బరిపూర్ణమనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకుఁ బ్రమోదంబు నొందుచుండి; రిట్లు గోపకులు బృందావనంబు జొచ్చి యం దర్ధచంద్రాకారంబుగ శకట సందోహంబు నిలిపి మందలు విడియించి వసియించిరి.
10.1-428-క.
చెందిరి బలమాధవు లభి
నందించుచుఁ బరమ పావనము సంచిత కా
ళిందీ సంజీవనమున్
బృందావనమున్ మునీంద్రబృందావనమున్.


భావము:
రోహిణీ దేవి, యశోదాదేవి ఎంతో సంతృప్తితో ఒకే బండిలో కూర్చున్నారు. బలరామకృష్ణులను ఎదుట కూర్చోపెట్టుకుని, వారి ఆటపాటలతో ఆనందిస్తూ ప్రయాణం సాగించారు. ఈ విధంగా గోకులంలోని ప్రజలు అందరూ బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. అలాగే ఇండ్లను కూడా కట్టుకుని అక్కడ నివసించారు. ఇలా బలరామకృష్ణులు సంతోషంతో పరమ పావనమైన బృందావనంలో ప్రవేశించారు. ఆ బృందావనం కాళింది నదికి ప్రాణాలు పోసినట్లుగా ఉంది. అది మునీంద్రులు అందరినీ రక్షించేది.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Thursday, August 23, 2018

శ్రీకృష్ణ లీలలు - 74

10.1-421-క.
భిక్షులు వచ్చెద రేడ్చిన; 
భిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద; రని చెప్పిన
భిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లు నృపా!
10.1-422-వ.
ఇట్లు కృష్ణుండు బహువిధంబులఁ గపటబాలలీలల వినోదింప, బృహద్వనంబున నందాదు లైన గోపవృద్ధులు మహోత్పాతంబు లగుటయు, వానివలన బాలుం డుత్తరించుటయుఁ జూచి యేకాంతంబున నొక్కనాడు విచారింప నుపనందుం డను వృద్ధగోపకుండు తన యెఱుక మెఱసి యిట్లనియె.

భావము:
ఓ మహారాజా! యశోదాదేవి “ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకు వెళ్ళి కొడతారు జాగ్రత్త” అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు. ఇలా చిన్ని కృష్ణుడు కపటబాలలీలలు చూపుతూ క్రీడిస్తూ గోపికలను, గోపాలురను, అందరిని వినోదింపజేస్తున్నాడు. ఒకరోజు నందుడూ, ఇతర గోపాలక పెద్దలూ వ్రేపల్లె దగ్గరి పెద్ద తోటలో సమావేశం అయ్యారు. అప్పటివరకు జరిగిన భయంకరమైన ఉత్పాతాలూ, వాటినుంచి కృష్ణుడు తప్పించుకోటం మున్నగు విషయాలు చర్చించారు. వారిలో ఉపనందుడు అనే వృద్ధగోపాలుడు బుద్ధిలో దైవసంకల్పం వలన ఒక ఆలోచన మెరిసింది, అతడు యాదవులందరం కలిసి బృందావనం వెళదాం అని అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=58&padyam=421

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 73

10.1-419-క.
చుంచొదువుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదువ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
10.1-420-క.
సెలగోల పట్టుకొని జల
కలశములో నీడఁ జూచి కలశయుతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికి జెప్పెన్.


భావము:
ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలు చూపుటందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి. చిన్నికన్నయ్య ఒకరోజు సెలగోల చేతిలో పట్టుకొని, గిన్నెలోని నీళ్ళలోకి చూసాడు. తన ప్రతిబింబం కనబడింది. ఆ గిన్నెపట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా! ఇదిగో చూడు! ఒక పిల్లాడు సెలగోల పట్టుకొని నన్ను కొట్టటానికి వస్తున్నాడు” అన్నాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




Wednesday, August 22, 2018

శ్రీకృష్ణ లీలలు - 72

10.1-418-శా.
పాడున్ మందుని భంగి; గోపవనితల్ పాణిధ్వనుల్ సేయఁగా
నాడున్ జంత్రముకైవడిం; బరవశుండై హస్తముల్ త్రిప్పుచుం; 
జూడన్ నేరని వాని భంగి జనులం జూచున్; నగున్; బాలురం
గూడున్ బెద్దలపంపు చేయఁజను; డాగున్; మట్టిఁ జిట్టాడుచున్.

భావము:
అమాయకపు పిల్లాడిలా పాటలు పాడుతాడు, గోపికాస్త్రీలు చేతులతో లయబద్ధంగా చప్పట్లు చరుస్తూ ఉంటే, పరవశుడై కీలుబొమ్మలా చేతులు తిప్పుతూ నాట్యాలు చేస్తాడు. చూడటం తెలియవానిలా జనుల వంక పలకరింపుగా చూస్తాడు. నవ్వుతాడు, తోటి పిల్లలతో కలిసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెప్తే బుద్ధిమంతునిలా చేస్తాడు. తలుపుచాటున దాక్కుంటాడు. మట్టిలో ఆడతాడు.
నందాదుల మనసులు మళ్ళించటానికి ఇలా ప్రవర్తించాడు చిన్నికన్నయ్య.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=57&padyam=418

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

శ్రీకృష్ణ లీలలు - 71

10.1-416-క.
"నందుని కొమరుఁడు వినుఁ డీ
సందున మును దూఱి ఱోలు సరి యడ్డముగా
ముందటి కీడ్చిన మద్దులు 
గ్రందుకొనం గూలె; జనులఁ గంటి మిరువురన్."
10.1-417-వ.
అని యిట్లు పలికిన బాలకాలాపంబులు విని మిథ్యారూపంబు లని కొందఱనిరి; కొందఱు నానావిధంబుల సందేహించిరి; అంత నందుండు వికసిత వదనారవిందుం డగుచుఁ బట్టి కట్లు విడిచెను; నట్టి యెడఁ దన తెఱం గెవ్వరు నెఱుంగకుండవలె నని ఠవరకుమారుండు.


భావము:
“నందుని కొడుకు అయినట్టి కృష్ణుడు ఈ చెట్ల సందులలోనుంచి ముందు తాను దూరాడు. వెనుక నున్న ఱోలు ఏమో అడ్డంతిరిగింది. గట్టిగా లాగాడు. అంతే! మద్ది చెట్లు ఫెళఫెళ మంటూ కూలిపోయాయి. ఇద్దరు వ్యక్తులు కనబడ్డారు.” ఇట్లా యాదవ బాలురు చెప్పగా, కొందరు అబద్ధాలాడుతున్నారు అన్నారు. మరి కొందరు మరికొన్ని విధాలుగా సందేహించారు. అప్పుడు నందుడు తన కుమారుడు బ్రతికి బయటపడి నందుకు సంతోషించాడు. అతడు ముందుకు వచ్చి కృష్ణునికి కట్టిన త్రాళ్ళు విప్పాడు. ఆ సమయంలో ఈ విషయం నుండి గోపకుల మనస్సులు మళ్ళించటానికి, లీలా వినోది, కపట మానవ బాలకుడు అయిన కృష్ణుడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :