Thursday, August 23, 2018

శ్రీకృష్ణ లీలలు - 73

10.1-419-క.
చుంచొదువుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదువ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
10.1-420-క.
సెలగోల పట్టుకొని జల
కలశములో నీడఁ జూచి కలశయుతుండై
సెలగోలఁ బాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట ననుచుఁ దల్లికి జెప్పెన్.


భావము:
ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలు చూపుటందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి. చిన్నికన్నయ్య ఒకరోజు సెలగోల చేతిలో పట్టుకొని, గిన్నెలోని నీళ్ళలోకి చూసాడు. తన ప్రతిబింబం కనబడింది. ఆ గిన్నెపట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా! ఇదిగో చూడు! ఒక పిల్లాడు సెలగోల పట్టుకొని నన్ను కొట్టటానికి వస్తున్నాడు” అన్నాడు.



: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments: