Sunday, August 26, 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 2

10.1-429-వ.
ఇట్లు బృందావనంబు చెంది, కొంత కాలంబునకు రామకృష్ణులు సమానవయస్కులైన గోపబాలకులం గూడుకొని వేడుక లూదుకొన దూడలఁ గాచుచు.
10.1-430-సీ.
వేణువు లూఁదుచు వివిధ రూపములతో; 
గంతులు వైతురు గౌతుకమున; 
గురుకంబళాదుల గోవృషంబులఁ బన్ని; 
పరవృషభము లని ప్రతిభటింతు; 
రల్లులు దట్టించి యంఘ్రుల గజ్జలు; 
మొఱయఁ దన్నుదు రోలి ముమ్మరముగఁ
బన్నిదంబులు వైచి ఫలమంజరులు గూల్చి; 
వేటు లాడుదురు ప్రావీణ్య మొప్ప;
10.1-430.1-తే.
వన్య జంతు చయంబుల వానివాని
పదురు పదురుచు వంచించి పట్టఁబోదు; 
రంబుజాకరములఁ జల్లులాడఁ జనుదు; 
రా కుమారులు బాల్యవిహారు లగుచు.

భావము:
ఇలా బృందావనం చేరిన కొన్నాళ్ళ పిమ్మట, బలరామకృష్ణులు వేడుకతో తమ ఈడు గోపబాలురతో కలసి ఆనందంగా దూడలను కాయసాగారు.
ఆ బలరామకృష్ణులు వేణువులు ఊదుతూ రకరకాల వేషాలతో ఉత్సాహంతో గెంతులు వేయసాగారు; పెద్దపెద్ద కంబళ్ళతో వృషభాలరూపాలు తయారుచేసి, వాటిని శత్రు వృషభాలు అని వాటితో యుద్ధం చేయసాగారు; గుడ్డలతో బొమ్మలుచేసి వాటిని గట్టిగా తన్నుతుండేవారు, అలా కాలిగజ్జెలు ఘల్లుఘల్లు మంటూ మ్రోగసాగాయి; పందాలు వేసుకుని మరీ పండ్లగుత్తులను రాళ్ళతో కొడుతూ ఉంటారు; అడవి జంతువుల కూతలను అరుపులను అనుకరించి అరుస్తూ ఆ జంతువులు దగ్గరకు రాగానే వాటిని పట్టుకోబోతారు. తామరపూల కొలనులలో ప్రవేశించి ఒకరిపై ఒకరు నీళ్ళు చల్లుకుంటూ ఆడుతూ ఉంటారు. ఇలా ఆ రాకుమారులు గోపబాలకులై బాల్యక్రీడలలో చరించసాగారు

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=61&padyam=430

: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments: