10.1-427-వ.
అప్పుడు రోహిణీయశోద లేక రథంబునఁ బరిపూర్ణమనోరథలై రామకృష్ణుల ముందట నిడుకొని వారల వినోదంబులకుఁ బ్రమోదంబు నొందుచుండి; రిట్లు గోపకులు బృందావనంబు జొచ్చి యం దర్ధచంద్రాకారంబుగ శకట సందోహంబు నిలిపి మందలు విడియించి వసియించిరి.
10.1-428-క.
చెందిరి బలమాధవు లభి
నందించుచుఁ బరమ పావనము సంచిత కా
ళిందీ సంజీవనమున్
బృందావనమున్ మునీంద్రబృందావనమున్.
భావము:
రోహిణీ దేవి, యశోదాదేవి ఎంతో సంతృప్తితో ఒకే బండిలో కూర్చున్నారు. బలరామకృష్ణులను ఎదుట కూర్చోపెట్టుకుని, వారి ఆటపాటలతో ఆనందిస్తూ ప్రయాణం సాగించారు. ఈ విధంగా గోకులంలోని ప్రజలు అందరూ బృందావనంలో ప్రవేశించారు. బండ్లను అర్ధచంద్రాకారంగా నిలబెట్టి ఆవుల మందలను మధ్యలో ఉంచారు. అలాగే ఇండ్లను కూడా కట్టుకుని అక్కడ నివసించారు. ఇలా బలరామకృష్ణులు సంతోషంతో పరమ పావనమైన బృందావనంలో ప్రవేశించారు. ఆ బృందావనం కాళింది నదికి ప్రాణాలు పోసినట్లుగా ఉంది. అది మునీంద్రులు అందరినీ రక్షించేది.
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :
No comments:
Post a Comment