Saturday, May 16, 2015

కుంతీ స్తుతి - ఇట్లు ద్రోణతనయుం డేసిన

1-186-వచనము
ఇట్లు ద్రోణతనయుం డేసిన ప్రతిక్రియారహితం బయిన బ్రహ్మశిరం బనియెడి దివ్యాస్త్రంబు వైష్ణవతేజంబున నిరర్థకం బయ్యె; నిజ మాయావిలసనమున సకలలోక సర్గస్థితి సంహారంబు లాచరించు నట్టి హరికి ధరణీసుర బాణ నివారణంబు విచిత్రంబు గాదు; తత్సమయంబున సంతసించి, పాండవ పాంచాలీ సహితయై గొంతి గమనోన్ముఖుం డైన హరిం జేర వచ్చి యిట్లనియె.
                          అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం తిరుగు లేనిది అయినప్పటికీ, వైష్ణవ తేజస్సు ముందు వ్యర్థం అయిపోయింది. ఒక బ్రాహ్మణ యువకుడి బాణాన్ని నివారించటం అన్నది, తన మాయా ప్రభావంతో నిఖిల జగత్తును నిర్మించి, భరించి, హరించే పరమాత్ముడికి విచిత్రమైన విషయమేమీ కాదు. అప్పుడు ఎంతో సంతోషంతో కుంతీ దేవి కోడలు ద్రౌపది, కొడుకులు పాండవులతో వచ్చి ద్వారకకు ప్రయాణం అవుతున్న శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతించింది-
1-186-vachanamu
iTlu drONatanayuM DEsina pratikriyaarahitaM bayina brahmashiraM baniyeDi divyaastraMbu vaiShNavatEjaMbuna nirarthakaM bayye; nija maayaavilasanamuna sakalalOka sargasthiti saMhaaraMbu laachariMchu naTTi hariki dharaNeesura baaNa nivaaraNaMbu vichitraMbu gaadu; tatsamayaMbuna saMtasiMchi, paaMDava paaMchaalee sahitayai goMti gamanOnmukhuM Daina hariM jEra vachchi yiTlaniye.
              ఇట్లు = ఈ విధముగ; ద్రోణతనయుండు = అశ్వత్థామ {ద్రోణతనయుడు - ద్రోణుని కొడుకు, అశ్వత్థామ}; ఏసిన = వేసిన; ప్రతిక్రియా = ఎదురు చేయటకు; రహితంబు = వీలు లేనట్టిది; అయిన = అయినటువంటి; బ్రహ్మశిరంబు = బ్రహ్మశిరము; అనియెడి = అనెడి; దివ్య = దివ్యమైన; అస్త్రంబు = అస్త్రము; వైష్ణవ = విష్ణువు యొక్క; తేజంబున = ప్రభావము వలన; నిరర్థకంబు = నిష్ప్రయోజనము; అయ్యెన్ = అయినది; నిజ = తన; మాయా = మాయ యొక్క; విలసనమున = విలాసము వలన; సకల = సమస్త; లోక = లోకముల యొక్క; సర్గ = సృష్టి; స్థితి = పాలన; సంహారంబులు = సంహారములు; ఆచరించున్ = ఆచరించే వాడు; అట్టి = అయిన; హరి = హరి; కిన్ = కి; ధరణీసుర = బ్రాహ్మణుని {ధరణీసుర - భూమికి దేవత, బ్రాహ్మణుని}; బాణ = బాణమును; నివారణంబు = ఆపుట; విచిత్రంబున్ = విచిత్రమేమి; కాదు = కాదు; తత్ = ఆ; సమయంబున = సమయములో; సంతసించి = సంతోషించి; పాండవ = పాండవులతోను {పాండురాజు సంతానము – పాండవులు, 1ధర్మరాజు, 2భీష్ముడు, 3అర్జునుడు, 4నకులుడు, 5సహదేవుడు}; పాంచాలీ = పాంచాల రాకుమారి (ద్రౌపది) తోను; సహిత = కూడినది; ఐ = అయ్యి; గొంతి = కుంతి; గమన = వెళ్ళుటకు; ఉన్ముఖుండు = సిద్ధపడినవాడు; ఐన = అయినట్టి; హరిన్ = కృష్ణుని {హరి - సర్వ దుఃఖములను హరించు వాడు}; చేరన్ = చేరువకు; వచ్చి = వచ్చి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :

Friday, May 15, 2015

కృష్ణలీలలు

10.1-421-కంద పద్యము
బిక్షులు వచ్చెద రేడ్చిన;
బిక్షాపాత్రమున వైచి బెగడించి నినున్
శిక్షించెద; రని చెప్పిన
బిక్షులఁ గని, తల్లిఁ గనియు భీతిల్లె నృపా!
         ఓ మహారాజా! యశోదాదేవి “ఏడవుకురా కన్నా! ఇదిగో బిచ్చగాళ్లు వస్తున్నారు. ఏడుస్తుంటే వాళ్ళు నిన్ను జోలెలో వేసుకొని తీసుకెళ్ళి కొడతారు జాగ్రత్త” అని బెదిరించింది. చిన్నికిట్టయ్య వాకిట్లోకి వచ్చిన బిచ్చగాళ్లను చూసి, తల్లి వైపు భయపడుతూ చూసాడు.
10.1-421-kaMda padyamu
bikShulu vachcheda rEDchina;
bikShaapaatramuna vaichi begaDiMchi ninun
shikShiMcheda; rani cheppina
bikShulaM~ gani, talliM~ ganiyu bheetille nRipaa!  
          బిక్షులు = అడుక్కొనెడివారు; వచ్చెదరు = వస్తారు; ఏడ్చినన్ = ఏడ్చినచో; భిక్షాపాత్రమునన్ = బిక్షాపాత్రయందు; వైచి = వేసుకొని; బెగడించి = బెదిరించి; నినున్ = నిన్ను; శిక్షించెదరు = దండింతురు; అని = అని; చెప్పినన్ = చెప్పినచో; బిక్షులన్ = బిచ్చగాళ్ళను; కని = చూసి; తల్లిన్ = తల్లిని; కనియున్ = కనుగొనినను; భీతిల్లె = భయపడెను; నృపా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Thursday, May 14, 2015

కృష్ణలీలలు

10.1-420-కంద పద్యము
సెలగోల పట్టుకొని జల
కలశములో నీడఁ జూచి కలశయుతుండై
“సెలగోలఁ పాపఁ డొకఁ డిదె
తలచెన్ ననుఁ గొట్ట” ననుచుఁ దల్లికి జెప్పెన్.
          చిన్నికన్నయ్య ఒకరోజు సెలగోల చేతిలో పట్టుకొని, గిన్నెలోని నీళ్ళలోకి చూసాడు. తన ప్రతిబింబం కనబడింది. ఆ గిన్నెపట్టుకొని తల్లి దగ్గరకు వెళ్ళి “అమ్మా! పాపాయి ఒకడు, ఇదిగో చూడు! సెలగోల పట్టుకొని నన్ను కొట్టటానికి వస్తున్నాడు” అన్నాడు.
10.1-420-kaMda padyamu
selagOla paTTukoni jala
kalashamulO neeDaM~ joochi kalashayutuMDai
“selagOlaM~ paapaM~ DokaM~ Dide
talachen nanuM~ goTTa” nanuchuM~ dalliki jeppen.
          సెలగోల = చెర్నాకోల, కొరడాకర్ర; పట్టుకొని = చేతబట్టి; జల = నీటి; కలశము = బాన; లోన్ = అందు; నీడన్ = ప్రతిబింబమును; చూచి = చూసి; కలశ = కుండలో; యుతుడు = ఉన్నవాడు; ఐ = అయ్యి; సెలగోలన్ = కొరడాకర్రతో; పాపడు = చిన్నపిల్లవాడు; ఒకడు = ఒకానొకడు; ఇదె = ఇదిగో; తలచెన్ = అనుకుంటున్నాడు; ననున్ = నన్ను; కొట్టన్ = కొట్టాలి; అనుచున్ = అనుచు; తల్లి = తల్లి; కిన్ = కి; చెప్పెన్ = చెప్పెను.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Wednesday, May 13, 2015

కృష్ణలీలలు

10.1-419-కంద పద్యము
చుంచొదవుఁ బాలు ద్రావు ము
దంచితముగ ననుఁడుఁ బాలు ద్రావి జననితోఁ
జుం చొదవ దనుచు లీలా
చుంచుం డై యతఁడు చుంచుఁ జూపె నరేంద్రా!
          ఓ రాజా పరీక్షిత్తు! “చక్కగా పాలు తాగు జట్టు బాగా పెరుగుతుం” దని చెప్పి పాలు తాగించింది తల్లి యశోదాదేవి. పాలు తాగి చేతితో జుట్టు తడువుకుంటు “జుట్టు పెరగలేదేం టమ్మా” యని అడిగాడు లీలలు చూపు టందు ఆసక్తిగల ఆ బాలకృష్ణమూర్తి.
10.1-419-kaMda padyamu
chuMchodavuM~ baalu draavu mu
daMchitamuga nanuM~DuM~ baalu draavi jananitOM~
juM chodava danuchu leelaa
chuMchuM Dai yataM~Du chuMchuM~ joope narEMdraa!
          చుంచు = పిలక, బలము; ఒదవున్ = బాగగును, కలుగును; పాలున్ = పాలను; త్రావుము = తాగుము; ఉదంచితముగన్ = చక్కగా; అనుడున్ = అనిచెప్పగా; పాలున్ = పాలను; త్రావి = తాగి; జనని = తల్లి; తోన్ = తోటి; చుంచు = జుట్టు, బలము; ఒదవదు = పెరగలేదు; అనుచు = అంటూ; లీలాచుంచుండు = లీలలందు ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; అతడు = అతను; చుంచున్ = పిలకను; చూపెన్ = చూపించెను; నరేంద్రా = రాజా.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Tuesday, May 12, 2015

కృష్ణలీలలు

10.1-418-శార్దూల విక్రీడితము
పాడున్ మందుని భంగి; గోపవనితల్ పాణిధ్వనుల్ సేయఁగా
నాడున్ జంత్రముకైవడిం; బరవశుండై హస్తముల్ త్రిప్పుచుం;
జూడన్ నేరని వాని భంగి జనులం జూచున్; నగున్; బాలురం
గూడుం బెద్దలపంపు చేయఁజను; డాగున్; మట్టిఁ జిట్టాడుచున్.
          అమాయకపు పిల్లాడిలా పాటలు పాడుతాడు, గోపికాస్త్రీలు చేతులతో లయబద్ధంగా చప్పట్లి చరుస్తూ ఉంటే, పరవశుడై కీలుబౌమ్మలా చేతులు తిప్పుతూ నాట్యాలు చేస్తాడు. చూడటం తెలియవానిలా జనుల వంక పలకరింపుగా చూస్తాడు. నవ్వుతాడు, తోటి పిల్లలతో కలుసి గంతులు వేస్తాడు. పెద్దవారు ఏమైనా చెప్తే బుద్ధిమంతునిలా చేస్తాడు. తలుపుచాటున దాక్కుంటాడు. మట్టిలో ఆడతాడు.
          కూలిన మద్దిచెట్లు చూసి తర్కించుకుంటున్న నందాదుల మనసులు మళ్ళించటానికి ఇలా ప్రవర్తించాడు చిన్నికన్నయ్య.
10.1-418-shaardoola vikreeDitamu
paaDun maMduni bhaMgi; gOpavanital paaNidhvanul sEyaM~gaa
naaDun jaMtramukaivaDiM; baravashuMDai hastamul trippuchuM;
jooDan nErani vaani bhaMgi janulaM joochun; nagun; baaluraM
gooDuM beddalapaMpu chEyaM~janu; Daagun; maTTiM~ jiTTaaDuchun.
          పాడున్ = గీతములు పాడును; మందుని = ఏమీతెలియనివాని; భంగిన్ = విదముగ; గోపవనితలు = గోపికలు; పాణిధ్వనుల్ = చప్పట్లు; చేయగాన్ = కొడుతుండగా; ఆడున్ = నాట్యముచేయును; జంత్రము = కీలుబొమ్మ; కైవడిన్ = వలె; పరవశుండు = మిక్కిలిఆనందించువాడు; ఐ = అయ్యి; హస్తముల్ = చేతులు; త్రిప్పుచున్ = ఆడించుచు; చూడన్ = చూడ్డానికి; నేరనివాని = ఏమీతెలియనివాని; భంగిన్ = వలె; జనులన్ = ప్రజలను; చూచున్ = చూచును; నగున్ = నవ్వును; బాలురన్ = పిల్లలతో; కూడున్ = కలియును; పెద్దల = పెద్దవారి; పంపున్ = చెప్పినపనిని; చేయన్ = చేయుటకు; చనున్ = వెళ్ళును; డాగున్ = మరుగునదాగును; మట్టిన్ = మట్టిలో; చిట్టాడుడుచున్ = చిమ్ముకొనుచు.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :

Monday, May 11, 2015

కృష్ణలీలలు

10.1-414-తేటగీతి
పిడుగు పడదు; గాక పెనుగాలి విసరదు;
ఖండితంబు లగుట గానరాదు;
బాలుఁ డితఁడు; పట్టి పడఁ ద్రోయఁజాలఁడు;
తరువు లేల గూలె ధరణిమీఁద”
            అసలు ఈ మహా వృక్షాలు ఎలా పడిపోయాయి? పిడుగు పడింది లేదు. పోనీ పెద్దగాలి వీచిందా అంటే అదిలేదు. ఎవరు నరికిన సూచనలు ఏమి లేవు. కూకటి వేళ్ళతో సహా కూలిపోయాయి. ఈ పిల్లాడు ఏమైనా పడగొట్టాడు అనుకుందా మంటే మరీ ఇంత పసిపిల్లాడు అంత పెద్ద చెట్లను పడ తొయ్యటం అసాధ్యం కదా! మరి అయితే ఈ చెట్లు ఎలా కూలిపోయినట్లు?"
అని నందుడు మొదలైన గోపాలకులు అనుకుంటున్నారు.
10.1-414-tETageeti
piDugu paDadu; gaaka penugaali visaradu;
khaMDitaMbu laguTa gaanaraadu;
baaluM~ DitaM~Du; paTTi paDaM~ drOyaM~jaalaM~Du;
taruvu lEla goole dharaNimeeM~da”
          పిడుగు = పిడుగేమీ; పడదు = పడలేదు; కాక = అదికాకుండ; పెనుగాలి = గట్టిగాలి; విసరదు = వేయలేదు; ఖండితంబులు = నరకబడినవి; అగుటన్ = అగుటకూడ; కానరాదు = కనబడదు; బాలుడు = చిన్నపిల్లవాడు; ఇతడున్ = ఇతను; పట్టి = పట్టుకొని; పడద్రోయన్ = పడునట్లుతోయుటకు; చాలడు = సరిపడడు; తరువులు = వృక్షములు; ఏలన్ = ఎందుచేత; కూలెన్ = పడిపోయినవి; ధరణి = నేల; మీదన్ = మీద.
: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం : :