Saturday, January 1, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౩౮(438)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-936-తే.
"ఏ నెఱుంగక చేసిన యీ యవజ్ఞ
శాంతి వొంద నేయది యభీష్టంబు మీకు
దానిఁ గావింతు" ననిన మోదంబు నొంది
పలికి రత్తాపసులు హలపాణిఁ జూచి.
10.2-937-చ.
"హలధర! యిల్వలుండను సురారితనూజుఁడు పల్వలుండు నాఁ
గలఁడొక దానవుండు బలగర్వమునం బ్రతిపర్వమందు న
చ్చలమున వచ్చి మా సవనశాలల మూత్ర సురాస్ర పూయ వి
ట్పలలము లోలిమైఁ గురిసి పాడఱఁ జేయును యజ్ఞవాటముల్‌. 

భావము:
“తెలియక నేను చేసిన ఈ అపరాధం శాంతించేలాగ మీకు ఇష్టమైన కార్యం చెప్పండి చేస్తాను.” అని పలికిన బలరాముడి మాటలకు ఋషులు పరమానందం చెంది, అతడితో “బలరామా! నాగలి ఆయుధంగా గలవాడా! ఇల్వలుడనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు బలగర్వితుడై ప్రతి పర్వం నాడూ వచ్చి యజ్ఞశాలల్లో మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను చాటునుండి కురిపించి పాడుచేస్తున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=937 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: