Wednesday, January 19, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౪(454)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-973-తే.
"నీవు సెప్పిన యట్ల రాజీవనేత్రు
పాదపద్మంబు లాశ్రయింపంగఁ జనుట
పరమశోభన మా చక్రపాణి కిపుడు
గాను కేమైనఁ గొంపోవఁ గలదె మనకు? "
10.2-974-తే.
అనిన నయ్యింతి "యౌఁగాక" యనుచు విభుని
శిథిల వస్త్రంబు కొంగునఁ బృథుక తండు
లముల నొకకొన్ని ముడిచి నెయ్యమున ననుపఁ
జనియె గోవింద దర్శనోత్సాహి యగుచు.
10.2-975-వ.
అట్లు సనుచుం దన మనంబున. 

భావము:
“నీ వన్నట్లు శ్రీకృష్ణుడిని ఆశ్రయించడం పరమ కల్యాణప్రదమే. కాని చక్రి దగ్గఱకు వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళడానికి కానుక ఏదయినా మన వద్ద ఉందా.” భర్త అభిప్రాయం అంగీకరించిన కుచేలుని భార్య “అలాగే కానివ్వండి” అంది. పిమ్మట అతని చినిగిన పైట కొంగులో కొన్ని అటుకులు ముడివేసి ప్రేమతో ప్రయాణానికి సిద్ధం చేసింది. కుచేలుడు గోవింద దర్శనం అవుతుందనే ఉత్సాహంతో బయలుదేరాడు. ద్వారకకు వెళుతూ దారిలోకుచేలుడు తనలో ఇలా అనుకోసాగాడు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=974 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: