Thursday, January 6, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౩(443)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-948-వ.
చని యమ్మహానదిం గృతస్నానుండై యచ్చోటు వాసి సరయువు నందుఁ గ్రుంకులిడి ప్రయాగ నవగాహనంబు సేసి దేవర్షి పితృతర్పణంబు లాచరించి పులస్త్యాశ్రమంబు సొచ్చి గోమతిం దర్శించి గండకీనది నుత్తరించి విదళితభవపాశయగు విపాశయందుఁదోఁగి శోణనదంబున నాప్లావితుండై గయనాడి గంగాసాగరసంగమంబు దర్శించి మహేంద్రనగంబున కరిగి.
10.2-949-క.
రాముఁడుఁ గనుఁగొనె భార్గవ
రామున్ రజనీశ కులధరావరనగ సు
త్రామున్ సన్నుత సుగుణ
స్తోముం గారుణ్యసీము సుజనలలామున్. 

భావము:
ఆ మహానదికౌశికీలో బలరాముడు స్నానం చేసాడు. అక్కడ నుండి బయలుదేరి సరయూనదిలోను స్నానం చేసి, పిమ్మట ప్రయాగలో స్నానం చేసాడు. దేవర్షి పితృతర్పణాలు కావించాడు. అటు తరువాత పులస్త్యాశ్రమం ప్రవేశించాడు. అటుపిమ్మట గోమతిని దర్శించి గండకీనదిని దాటి పరమపావని అయిన విపాశలో స్నానంచేసి, శోణనదిలోనూ తర్వాత గయలోనూ స్నానమాడి గంగాసాగరసంగమం సందర్శించి. పిమ్మట బలరాముడు మహేంద్రపర్వతం చేరాడు. ఆ మహేంద్రగిరి మీద క్షత్రియ కులాన్ని మట్టుపెట్టినవాడూ, స్తుతింపబడే సద్గుణాలు కలవాడూ, దయాశాలి, సత్ప్రవర్తక శ్రేష్ఠుడు అయిన పరశురాముడిని బలరాముడు దర్శించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=949 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: