Saturday, January 29, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౬౩(463)

( కుచేలుని ఆదరించుట ) 

10.2-992-క.
"ఎఱుఁగుదువె? మనము గురు మం
దిరమున వసియించి యతఁడు దెలుపఁగ వరుస
న్నెఱుఁగఁగ వలసిన యర్థము
లెఱిఁగి పరిజ్ఞానమహిమ లెఱుఁగుట లెల్లన్. "
10.2-993-వ.
అని మఱియు గురుప్రశంస సేయం దలంచి యిట్లనియె.
10.2-994-తే.
తివిరి యజ్ఞానతిమిర ప్రదీపమగుచు
నవ్యయంబైన బ్రహ్మంబు ననుభవించు
భరితసత్త్వుండు సత్కర్మనిరతుఁ డతుల
భూసురశ్రేష్ఠుఁ డలఘుండు బుధనుతుండు 

భావము:
“మనం గురువుగారి నివాసంలో ఉన్నప్పుడు ఆచార్యుడు బోధించగా నేర్చుకోవలసినవి మనం వరుసగా నేర్చుకుని గొప్ప విజ్ఞానము గడించిన సంగతి నీకు జ్ఞాపకం ఉందా?” ఇలా కుచేలుని పలకరిస్తున్న శ్రీకృష్ణుడు గురుప్రశంస చేయదలచి ఇలా అన్నాడు. “మన గురువు అజ్ఞానం అనే చీకటికి దీపం లాంటివాడు; బ్రహ్మానందానుభవంలో నిమగ్నమైన చిత్తం కలవాడు; సత్కర్మ పరాయణుడు; బ్రాహ్మణ శ్రేష్ఠుడు; పుణ్యాత్ముడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=994 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: