Thursday, January 13, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౦(450)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-963-చ.
హరిభజియించుహస్తములుహస్తము; లచ్యుతుఁగోరి మ్రొక్కు త
చ్ఛిరము శిరంబు; చక్రధరుఁ జేరిన చిత్తము చిత్త; మిందిరా
వరుఁగను దృష్టి దృష్టి; మురవైరి నుతించిన వాణి వాణి; య
క్షరుకథ లాను కర్ణములు కర్ణములై విలసిల్లుఁబో భువిన్.
10.2-964-క.
హరిపాదతీర్థ సేవా
పరుఁడై విలసిల్లునట్టి భాగవతుని వి
స్ఫురితాంగము లంగము; లా
పరమేశ్వరు నెఱుఁగ నాకుఁ బలుకు మునీంద్రా! " 

భావము:
హరిని పూజించే చేతులే చేతులు; అచ్యుతునికి నమస్కరించే శిరస్సే శిరస్సు; ఆ చక్రధారుని చూసే కన్నులే కన్నులు; ఆ లక్ష్మీపతిని పొగడే నోరే నోరు; ఆ శాశ్వతుని కథలను వినే చెవులే చెవులు. ఓ మునీశ్వరా! శ్రీహరి పాదపద్మాలు అనే తీర్థాలను సేవించి ధన్యుడైన భాగవతుని అంగములే అంగములు. ఆ పరమాత్ముని తెలుసుకొనే మార్గం నాకు విశదీకరించి చెప్పవలసినది.” 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=964 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: