Tuesday, January 4, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౧(441)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-943-చ.
గగనమునం జరించు సురకంటకు కంఠము చేఁతినాగటం
దగిలిచి రోఁక లెత్తి బెడిదం బడరన్ నడునెత్తి మొత్తినన్
బుగబుగ నెత్తు రొల్క నిలఁ బోరగిలం బడె వజ్రధారచేఁ
దెగి ధరఁ గూలు భూరి జగతీధరముం బురుడింప బెట్టుగాన్.
10.2-944-వ.
అట్లు పల్వలుండు మడిసిన.
10.2-945-క.
మునివరులు గామపాలుని
వినుతించిరి వేయువేల విధముల వృత్రుం
దునిమిన యింద్రుని నమరులు
వినుతించిన రీతి నపుడు విమలచరిత్రా! 

భావము:
ఆకాశంలో సంచరిస్తున్న దేవతల పాలిటి పీడగా ఉన్న పల్వలుడి కంఠానికి నాగలిని తగిలించి క్రిందకు లాగి, బలరాముడు రోకలితో వాడి నడినెత్తి మీద బలంగా మొత్తాడు. ఆ దెబ్బకు ఇంద్రుని వజ్రాయుధం వేటుకు విరిగిపడే పర్వతంలాగ, పల్వలుడు బుగబుగ నెత్తురు కక్కుకుంటూ భూమిపై బోరగిలా పడ్డాడు. ఆ విధంగా పల్వలుడు నేలకూలడం చూసి. వృత్రాసురుడిని సంహరించిన దేవేంద్రుడిని దేవతలు అందరు స్తుతించిన విధంగా మును లందరూ బలరాముణ్ణి అనేక విధములుగా స్తుతించారు 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=945 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: