Friday, January 7, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౪(444)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-950-ఆ.
కని నమస్కరించి కౌతుకం బలరార
నతని వీడుకొని హలాయుధుండు
గొమరుమిగిలి సప్తగోదావరికి నేఁగి
యందుఁ దీర్థమాడి యచటు గదలి.
10.2-951-వ.
వేణీపంపాసరస్సులంజూచి, భీమనదికేఁగి యందుఁ గుమారస్వామిని దర్శించి, శ్రీశైలంబునకుఁ జని, వేంకటాచలంబు దర్శించి, కామకోటి శక్తిని నిరీక్షించి, కాంచీపురంబుం గాంచి, కావేరికిం జని యమ్మహావాహిని నవగాహనంబు సేసి.
10.2-952-స్రగ్ద.
సేవించెన్ రంగధామున్ శ్రితనివహపయస్సింధుసంపూర్ణసోముం
గావేరీ మధ్యసీమున్ ఘనకలుష మహాకాలకూటోగ్ర భీమున్
దేవారిశ్రీ విరామున్ దివిజవినుత సందీపితానంత నామున్
ధీవిజ్ఞానాభిరాముం ద్రిభువన విలసద్దేవతా సార్వభౌమున్. 

భావము:
పరశురాముడికి ప్రణామాలర్పించి, బలరాముడు అతడి వద్ద సెలవు తెలుసుకుని సప్తగోదావరికి వెళ్ళి అందులో స్నానం చేసాడు. అక్కడ నుండి బయలుదేరి బలరాముడు పిమ్మట వేణీనదిని పంపానదిని దర్శించాడు. భీమానది చేరి అక్కడ వెలసిన కుమారస్వామి దర్శనం చేసుకుని, శ్రీశైలం, తిరుమల దర్శించాడు. కాంచీపురం కామాక్షిని చూసాడు. అక్కడనుండి కావేరికి వెళ్ళి ఆ మహానదిలో స్నానం చేసాడు. బలరాముడు ఆ కావేరీ నదీమధ్యంలో వెలసిన శ్రీరంగం చేరాడు. ఆశ్రితులనే పాలసముద్రానికి పూర్ణచంద్రుని వంటివాడూ; కలుషాలను కబళించేవాడూ; రాక్షసుల సంపదలను హరించేవాడూ; జ్ఞానుల మనసులు అలరించేవాడు; అమరులు వినుతించే అనంత నామాలు కలవాడూ; ముల్లోకాల లోని సకల దేవతలకు అధినాథుడూ; అయిన శ్రీరంగనాథుడిని సేవించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=952 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: