Monday, January 17, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౨(452)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-967-వ.
అని మఱియు నిట్లనియె.
10.2-968-తే.
"బాలసఖుఁడైన యప్పద్మపత్త్రనేత్రుఁ
గాన నేఁగి దారిద్య్రాంధకార మగ్ను
లైన మము నుద్ధరింపుము; హరికృపా క
టాక్ష రవిదీప్తి వడసి మహాత్మ! నీవు.
10.2-969-వ.
మఱియును.
10.2-970-చ.
వరదుఁడు సాధుభక్తజనవత్సలుఁ డార్తశరణ్యుఁ డిందిరా
వరుఁడు దయాపయోధి భగవంతుఁడు కృష్ణుఁడు దాఁ గుశస్థలీ
పురమున యాదవప్రకరముల్‌ భజియింపఁగ నున్నవాఁడు; నీ
వరిగిన నిన్నుఁ జూచి విభుఁ డప్పుడ యిచ్చు ననూన సంపదల్‌. 

భావము:
అని శోకంతో పలికి భర్తతో ఇంకా ఇలా అన్నది. “మహానుభావ! శ్రీకృష్ణుడు మీ బాల్యసఖుడు కదా. మీరు వెళ్ళి ఆ మహానుభావుడిని దర్శించండి. అతని కృపాకటాక్షం పొంది, దారిద్ర్యంతో తల్లడిల్లుతున్న పిల్లలను, నన్ను కాపాడండి. శ్రీకృష్ణుడు ఆశ్రితులను రక్షించేవాడు; సజ్జనుల ఎడ, భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు; దయాసాగరుడు; యాదవులు తనను సేవిస్తుండగా, కుశస్థలీపురములో ఉన్నాడు కదా. ఒక్కసారి, ఆ శ్రీపతిని దర్శించండి. మిమ్మల్ని చూస్తే చాలు వెంటనే ప్రభువు మీకు అనంతమైన సంపదలు అనుగ్రహిస్తాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=970 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: