Tuesday, January 11, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౮(448)

( బలుడు పల్వలుని వధించుట ) 

10.2-958-చ.
విలసిత మాల్య చందన నవీన విభూషణ రత్న వస్త్రముల్‌
పొలుపుగఁ దాల్చి యంచిత విభూతిఁ దలిర్చెను బూర్ణచంద్రికా
కలిత సుధాంశురేఖ నెసకం బెసఁగన్ నిజబంధులోచనో
త్పలచయ ముల్లసిల్లఁ బరిపాండుర చారు యశోవిలాసుఁడై.
10.2-959-వ.
ఇవ్విధంబున ననంతుండు నప్రమేయుండును మాయామానుష విగ్రహుండు నసంఖ్యబలశాలియు నైన బలదేవుం డతివైభంబున నిజపురంబు ప్రవేశించి సుఖంబుండె” నని చెప్పి యిట్లనియె. 

భావము:
బలరాముడు పూలదండలు వేసుకుని, చందనం అలదుకొని, వినూత్న వస్త్రాభరణాలను ధరించాడు. అప్పుడు బలరాముడు నిండు పున్నమి చంద్రుడిలా, పరిపూర్ణ యశోభిరాముడై, బందువుల నేత్రాలనే కలువలకు వికాసం కలిగించాడు. ఆ విధంగా అంతులేని మహాబలశాలీ, మాయా మానుష వేషధారీ, అనంతుడు, మేరలేని వాడు, ఆదిశేషుని అపర అవతారుడు అయిన బలరాముడు మిక్కిలి వైభవంతో ద్వారకానగరం ప్రవేశించి సుఖంగా ఉన్నాడు. అని శుకబ్రహ్మ చెప్పి, మరల పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=959 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: