10.2-954-తే.
ధర్మనందనుఁ దనకు వందనము సేయు
కృష్ణు నరు మాద్రిసుతుల నీక్షించి యేమి
పలుక కుగ్ర గదాదండపాణు లగుచుఁ
గ్రోధమునఁ బోరు భీమ దుర్యోధనులను.
10.2-955-వ.
చూచి వారల డాయం జని యిట్లనియె.
10.2-956-సీ.
"వీరపుంగవులార! వినుఁడు; మీలోపల-
భూరిభుజాసత్త్వమున నొకండు
ప్రకటితాభ్యాస సంపద్విశేషంబున-
నొక్కండు యధికుఁడై యుంటఁ జేసి
సమబలు; లటు గాన చర్చింపఁగా నిందు-
జయ మొక్కనికి లేదు సమరమందుఁ;
గాన యూరక పోరఁగా నేల మీ"కని-
వారింప నన్యోన్య వైరములను
10.2-956.1-తే.
నడరి తొల్లింటి దుర్భాష లాత్మలందుఁ
దలఁచి తద్భాషణము లపథ్యములు గాఁగ
మొక్కలంబునఁ బోర నా ముష్టికాసు
రారి వీక్షించి "వీరి శుభాశుభములు,
భావము:
అక్కడ ధర్మరాజుని మఱియు తనకు నమస్కరిస్తున్న శ్రీకృష్ణ, అర్జున, నకుల, సహదేవాదులను గమనించి కూడ మాట్లాడకుండా, భీకరమైన గదలు చేతబట్టి కయ్యానికి కాలు దువ్వుతున్న భీమదుర్యోధనులను చూసి అలా యుద్ధ సన్నధులు అయిన భీమదుర్యోధనుల వద్దకు బలరాముడు వెళ్ళి ఇలా అన్నాడు. “మేటివీరులారా! నా మాట వినండి. మీలోఒకడు భుజబలంలో అధికుడు; మరొకడు అభ్యాస నైపుణ్యంలో శ్రేష్ఠుడు. మీరిద్దరూ సమానులు మీలో ఎవరూ ఎవరినీ గెలువలేరు. అయినా ఊరక యుద్ధానికి పూనుకోవడం దేనికి” అంటూ బలరాముడు వారిని వారింప చూసాడు. కాని, పాత పగలను మనసులో ఉంచుకున్న భీమదుర్యోధనులు బలరాముడి హితవచనాలను ఆలకించ లేదు. వారు పౌరుషంతో పోరాడటానికే నిశ్చయించారు. అది గమనించిన బలరాముడు వారి గురించి...
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=956
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment