Sunday, January 2, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౩౯(439)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-938-వ.
కావున దుష్టదానవుం ద్రుంచుటయు మాకుం గరంబు సంతసం బగు; నంతమీఁద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునం గల తీర్థంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి యగు"నని పలుకునంతఁ బర్వసమాగమంబైన.
10.2-939-సీ.
మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటఁ గనుఁగొని-
  పఱతెంచి యసుర తద్భవనములను
రక్త విణ్మూత్ర సురామాంసజాలంబు-
  నించి హేయంబు గావించి పెలుచఁ
బెంధూళి ఱాలును బెల్లలు నురలెడు-
  చక్రానిలము వీఁచి చదల నపుడు
గాటుకకొండ సంగతిఁ బొల్చు మేను తా-
  మ్రశ్మశ్రు కేశ సమాజములును
10.2-939.1-తే.
నవ్యచర్మాంబరము భూరినాసికయును
గఱకు మిడి గ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి
వ్రేలు పెదవులు దీర్ఘకరాళ జిహ్వి
కయును ముడివడ్డబొమలును గలుగువాని. 

భావము:
కనుక, దుర్మార్గుడైన ఆ పల్వల రాక్షసుడిని నీవు చంపితే మా కదే సంతోషదాయకం. పిమ్మట నీవు పండ్రెండు మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్ధాలను పన్నెడు (12) నెలలు సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి.” మునులు ఇలా అంటుండగానే పర్వము రానే వచ్చింది. యాగానికి మునులు ఉపక్రమించటం పల్వలుడు చూసాడు. వెంటనే అక్కడికి వచ్చి ఆ శాలలలో మలమూత్రాలు మద్యమాంసాలు కురిపించి నానా భీభత్సం చేసాడు. రాళ్ళతో, ధూళితో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలా చేసాడు. కాటుకకొండలాంటి నల్లని శరీరమూ, ఎఱ్ఱని గడ్డమూ మీసాలూ, పెద్దముక్కూ, మిడిగ్రుడ్లూ, నిప్పులు చిమ్మే చూపులూ, వ్రేలాడే పెదవులూ, పొడవైన నాలుకా, ముడిపడ్డ కనుబొమలతో భయంకరంగా ఆకాశంలో సంచరిస్తున్న ఆ రాక్షసుడు పల్వలుడిని బలరాముడు కని. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=939 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: