10.2-979-సీ.
ఇందీవరశ్యాము, వందితసుత్రాముఁ;
గరుణాలవాలు, భాసుర కపోలుఁ
గౌస్తుభాలంకారుఁ, గామితమందారు;
సురచిరలావణ్యు, సుర శరణ్యు
హర్యక్షనిభమధ్యు, నఖిలలోకారాధ్యు;
ఘనచక్రహస్తు, జగత్ప్రశస్తు,
ఖగకులాధిపయానుఁ, గౌశేయపరిధానుఁ;
బన్నగశయను, నబ్జాతనయను,
10.2-979.1-తే.
మకరకుండల సద్భూషు, మంజుభాషు
నిరుపమాకారు, దుగ్ధసాగరవిహారు,
భూరిగుణసాంద్రు, యదుకులాంభోధి చంద్రు,
విష్ణు, రోచిష్ణు, జిష్ణు, సహిష్ణుఁ, గృష్ణు
భావము:
నల్లకలువలవంటి శ్యామలవర్ణం వాడూ; దేవేంద్రునిచేత పొగడబడేవాడూ; కృపకు నిలయమైనవాడూ; ప్రకాశించే చెక్కిళ్ళు కలవాడూ; కౌస్తుభాన్ని ధరించిన వాడూ; ఆర్ధులకు కల్పవృక్షం వంటివాడూ; సౌందర్యమూర్తీ; దేవతలకు దిక్కయినవాడూ; సింహమధ్యముడూ; సకల లోకాల యందు పూజింపబడువాడూ; చక్రాయుధుడూ; జగత్తులో పేరెన్నిక గలవాడూ; గరుడవాహనుడూ; పీతాంబరధారీ; ఆదిశేషునిపై శయనించేవాడూ; అరవిందాక్షుడూ; మకరకుండల భూషణుడూ; మధుర భాషణుడూ; సాటిలేని మేటి సౌందర్యం కలవాడూ; పాలసముద్రంలో విహరించే వాడూ; సుగుణ సాంద్రుడూ; యాదవకుల మనే సాగరానికి చంద్రుడూ; సర్వ వ్యాపకుడూ; ప్రకాశ వంతుడూ; జయ శీలుడూ; సహన శీలుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు కనిపించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=979
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment