Monday, January 3, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౦(440)

( బలరాముని తీర్థయాత్ర ) 

10.2-940-మస్ర.
కనియెం దాలాంకుఁ డుద్యత్కటచటు; ల నటత్కాలదండాభశూలున్
జనరక్తాసిక్తతాలున్ సమధిక; సమరోత్సాహలోలుం గఠోరా
శనితుల్యోదగ్ర దంష్ట్రా జనిత శి; ఖకణాచ్ఛాదితాశాంతరాళున్
హననవ్యాపారశీలున్నతి; దృఢ ఘనమస్తాస్థిమాలుం గరాళున్
10.2-941-ఉ.
వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి వెలుంగఁగ నుల్లసద్గదా
దండముఁ గేలఁ ద్రిప్పుచు నుదారత రా బలభద్రుఁ డాసురో
ద్దండవిఘాతులౌ ముసలదారుణలాంగలముల్‌ దలంప మా
ర్తాండనిభంబులై యెదురఁ దత్‌క్షణమాత్రన తోఁచినన్ వెసన్.
10.2-942-వ.
అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబులగు నిజసాధనంబులు ధరియించి యప్పుడు. 

భావము:
చేతిలో చలిస్తూ ఉన్న భయంకరమైన శూలంతో; మానవ రక్తంతో తడిసి ఉన్న దౌడలుతో; రణోత్సవం అతిశయిస్తూ ఉన్న చిత్తంతో; దిక్కులనూ ఆకాశాన్నీ కప్పివేస్తు అగ్నికణాలు వెదజల్లుతున్న వజ్రాయుధం లాంటి వాడి కోరలతో; ప్రాణుల్ని చంపడమే వ్రతంగా ఆ దానవుడు తలకాయలనూ ఎముకలనూ హారంగా కట్టిమెడలో వేసుకుని; పరమ భయంకరంగా ఉన్న ఆ రాక్షసుడు పల్వలుడిని, జండాపై తాడిచెట్టు ఉండే బలరాముడు చూసాడు. అంతే కాకుండా ఆకాశంలో మెరుపులు మెరిసేలా చేతిలోని గదను త్రిప్పుతూ పల్వలుడు తన మీదకు రావడం చూసి, బలరాముడు రాక్షస సంహార సమర్థములైన రోకలినీ నాగలినీ స్మరించాడు. తక్షణమే అవి సూర్య సమాన తేజస్సుతో బలరాముడి ఎదుట ప్రత్యక్షమయ్యాయి. అలా సాక్షాత్కరించిన ఆయుధాలను అందుకుని ధరించాడు. అప్పుడు.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=68&Padyam=941 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: