10.2-976-సీ.
"ద్వారకానగరంబు నే రీతిఁ జొత్తును? ;
భాసురాంతఃపురవాసి యైన
యప్పుండరీకాక్షు నఖిలేశు నెబ్భంగి;
దర్శింపఁ గలనొ? తద్ద్వారపాలు
"రెక్కడి విప్రుఁడ? విం దేల వచ్చెద?" ;
వని యడ్డ పెట్టిరే నపుడు వారి
కే మైనఁ బరిదాన మిచ్చి చొచ్చెద నన్న;
నూహింప నర్థశూన్యుండ నేను;
10.2-976.1-తే.
నయిన నా భాగ్య; మతని దయార్ద్రదృష్టి
గాక తలపోయఁగా నొండు గలదె? యాతఁ
డేల నన్ను నుపేక్షించు? నేటిమాట?"
లనుచు నా ద్వారకాపుర మతఁడు సొచ్చి.
10.2-977-వ.
ఇట్లు ప్రవేశించి రాజమార్గంబునం జనిచని కక్ష్యాంతరంబులు గడచి చని ముందట.
భావము:
“ద్వారకలోనికి నేను ఎలా వెళ్ళగలను? అత్యంత ప్రభావవంత మైన అంతఃపురంలో ఉన్న శ్రీకృష్ణుడి దర్శనం ఎలా లభిస్తుంది? ఒకవేళ ద్వారపాలకులు “నీవెక్కడ బ్రాహ్మణుడవయ్యా! ఇక్కడకి ఎందుకు వచ్చావయ్యా” అని నన్ను అడ్డగిస్తే నేనేమి చేయగలను? వారికి ఏదయినా బహుమానం ఇద్దామన్నా నేను కటికదరిద్రుడినే. ఏమివ్వగలను? ఇంతకూ నా అదృష్టం ఎలా ఉందో? అయినా, ఆ శ్రీకృష్ణుని కృపాకటాక్షం తప్ప మరొక మార్గం ఏమున్నది? ఆయన నన్నెందుకు ఉపేక్షిస్తాడు?” ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారక ప్రవేశించాడు. ఇలా అనుకుంటూ కుచేలుడు ద్వారకాపట్టణం రాజమార్గాన ముందుకు సాగిపోయి, కొన్ని ప్రాకారాలు దాటాక అక్కడ....
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=976
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment