Tuesday, January 25, 2022
శ్రీకృష్ణ విజయము - ౪౬౦(460)
( కుచేలుని ఆదరించుట )
10.2-984-వ.
సురభికుసుమ మాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండఁ జూచి శుద్ధాంత కాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి.
భావము:
కుచేలుడి సిగలో పూలదండలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, గోదానం చేసి, ఆదరంగా కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది, కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి చేతి కంకణాలు ఘల్లుఘల్లు మంటుంటే వింజామరము వీచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=984
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment