Friday, January 21, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౫౬(456)

( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-978-సీ.
విశదమై యొప్పు షోడశసహస్రాంగనా;
కలితవిలాస సంగతిఁ దనర్చి
మహనీయ తపనీయ మణిమయగోపుర;
ప్రాసాద సౌధ హర్మ్యములు సూచి,
మనము బ్రహ్మానందమును బొందఁ గడు నుబ్బి;
సంతోషబాష్పముల్‌ జడిగొనంగఁ
బ్రకటమై విలసిల్లు నొక వధూమణి మంది;
రమున నింతులు చామరములు వీవఁ
10.2-978.1-తే.
దనరు మృదుహంసతూలికా తల్పమందుఁ
దానుఁ బ్రియయును బహు వినోదములఁ దనరి
మహితలావణ్య మన్మథమన్మథుండు
ననఁగఁ జూపట్టు పుండరీకాయతాక్షు 

భావము:
శ్రీకృష్ణుని పదహారువేల సతులతో ప్రకాశిస్తున్న సుందర సమున్నత మణిమయ స్వర్ణసౌధాలను చూసి కుచేలుడు పరమానందం చెందాడు. అతని కళ్ళలో ఆనందబాష్పాలు స్రవించాయి. ఒక అంగన మందిరంలో మగువలు వింజామరలు వీస్తుండగా హంసతూలికాతల్పం మీద శ్రీకృష్ణుడు సతీమణితో సరసాలాడుతున్నాడు. ఆ మన్మథమన్మథుడైన మనోహర సౌందర్యమూర్తిని పద్మాక్షుని దర్శించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=978 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: