10.2-985-ఉ.
ఏమి తపంబు సేసెనొకొ! యీ ధరణీదివిజోత్తముండు తొల్
బామున! యోగివిస్ఫుర దుపాస్యకుఁడై తనరారు నీ జగ
త్స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించి యున్నవాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్?
10.2-987-చ.
తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడఁగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదముం
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలం బరితుష్టుఁ జేయుచున్
వినయమునన్ భజించె; ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుడో? "
భావము:
“ఈ బ్రాహ్మణోత్తముడు పూర్వజన్మలో ఎంతటి తపస్సు చేసాడో? మహా యోగులచేత పూజింపబడే శ్రీపతి పరుండు పానుపు మీద అధివసించాడు. ఎంతటి మహామునులు అయినా ఈ మహానుభావునికి సాటిరారు కదా. తన మృదుతల్పం మీద ఉన్న రుక్మిణీదేవి సాంగత్యానికి ఎడబాటు అని కూడా చూడకుండా, శ్రీకృష్ణుడు లేచి వెళ్ళి విప్రోత్తమునికి స్వాగతం చెప్పాడు. ప్రేమతో అతడిని కౌగలించుకున్నాడు. సముచితంగా సత్కరించాడు. ఎంతో వినయంగా పూజించాడు. ఇంతటి గౌరవం పొందిన ఈ బ్రాహ్మణోత్తముడు ఎంత అదృష్టవంతుడో కదా.”
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=71&Padyam=987
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment