Saturday, January 8, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౫(445)

( బలుడు పల్వలుని వధించుట ) 

10.2-953-వ.
అచ్చోటు వాసి వృషభాద్రి నెక్కి, హరిక్షేత్రంబు ద్రొక్కి, మధురాపురంబున కరిగి, సేతుబంధనంబు మెట్టి, యచటం బదివేల పాఁడిమొదవుల భూసురుల కిచ్చి, రామేశ్వరుం దర్శించి, తామ్రపర్ణికిం జని, మలయాచలంబెక్కి, యగస్త్యునింగని నమస్కరించి, దక్షిణసముద్రంబు దర్శించి, కన్యాఖ్యదుర్గాదేవి నుపాసించి, పంచాప్సరంబను తీర్థంబున నాప్లవనం బాచరించి, గోకర్ణంబున నిందుమౌళిని దర్శించి, ద్వీపవతి యైన కామదేవిని వీక్షించి, తాపింబయోష్ణిని దర్శించి, నిర్వింధ్యంబు గడచి, దండకావనంబున కరిగి, మాహిష్మతీపురంబున వసియించి, మనుతీర్థం బాడి, క్రమ్మఱం బ్రభాసతీర్థంబునకు వచ్చి యచ్చటి బ్రాహ్మణ జనంబుల వలనఁ బాండవధార్తరాష్ట్రుల భండనంబు నందు సకలరాజలోకంబు పరలోకగతు లగుటయు, వాయునందన సుయోధనులు గదాయుద్ధ సన్నద్ధులై యుండుటయు నెఱింగి వారల వారించు తలంపున నచటికిం జని. 

భావము:
బలరాముడు అక్కడ నుండి వృషభాద్రికి వెళ్ళి, హరిక్షేత్రము, మధుర, సేతుబంధం దర్శించి, అక్కడ బ్రాహ్మణులకు పదివేల పాడిఆవులను దానం చేసాడు. రామేశ్వరం తామ్రపర్ణి చూసాడు. మలయాచలం ఎక్కి, అక్కడ అగస్త్యుడికి మ్రొక్కాడు. దక్షిణసముద్రము చేరి, కన్యాకుమారి పేర వెలసి ఉన్న దుర్గాదేవిని దర్శించి, గోకర్ణక్షేత్రంలో పరమేశ్వరుడిని దర్శించి, కామదేవి నదిని, తాపి యందలి పయోష్ణి నదిని దర్శించి. నిర్వింధ్యను దాటి, దండకాటవిని గడచి, మహిష్మతీ పురము ప్రవేశించాడు. మనుతీర్థంలో స్నానం చేసి పిమ్మట ప్రభాసతీర్థానికి వెళ్ళాడు. అక్కడి బ్రాహ్మణుల వలన కౌరవపాండవ సంగ్రామంలో రాజులు అందరూ హతులు అయ్యారనీ, భీమదుర్యోధనులు గదాయుద్ధానికి సన్నద్ధులు అవుతున్నారనీ తెలుసుకుని, వారిని చూడడానికి వెళ్ళాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=69&Padyam=953 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: