Wednesday, January 12, 2022

శ్రీకృష్ణ విజయము - ౪౪౯(449)


( కుచేలోపాఖ్యాన ప్రారంభంబు ) 

10.2-960-క.
హలధరు డమర్త్య చరితుం
డలఘు భుజాబలుఁ డొనర్చు నద్భుత కర్మం
బులు పెక్కు నాల్గు మోములు
గల మేటియు లెక్క పెట్టఁ గలఁడె నరేంద్రా! "
10.2-961-చ.
అనిన మునీంద్రుఁ గన్గొని ధరాధిపుఁ డిట్లను "పద్మపత్త్రలో
చనుని యనంత వీర్యగుణ సంపద వేమఱు విన్న నైననుం
దనియదు చిత్త మచ్యుతకథావిభవం బొకమాటు వీనులన్
వినిన మనోజపుష్ప శరవిద్ధుఁడు నైన విరామ మొందునే?
10.2-962-వ.
అదియునుం గాక. 

భావము:
“ఓ మహారాజా! పరీక్షిత్తు! హాలాయుధుడూ, దివ్యచారిత్రుడూ, భుజబల సంపన్నుడూ అయిన బలరాముడి అద్భుత కార్యాలను పొగడడానికి నాలుగు ముఖాలు గల బ్రహ్మదేవుడి కైనా సాధ్యంకాదు.” అలా చెప్పిన శుకమహర్షితో పరీక్షిత్తు ఇలా అన్నాడు “అంబుజాక్షుని అనంత గుణ సంపదలను గురించీ, పరాక్రమ ప్రాశస్త్యాలను గురించీ, ఎన్ని మార్లు విన్నా తనివితీరదు. ఒక్కసారి విష్ణు కథా వైభవాన్ని వింటే చాలు, ఎంత మన్మథ వికార పీడితు డైనా సరే మరీ మరీ వినకుండా ఉండ లేడు. అంతేకాకుండా.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=70&Padyam=961 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :


No comments: