10.2-872-చ.
వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా
సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్
విరవిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో
త్కరములు దేరిపై వదలి కన్నులుమూయుచు మూర్ఛనొందినన్
10.2-873-ఆ.
సమరధర్మ వేది సమధిక నయవాది
దారుకుని సుతుండు ధైర్యయుతుఁడు
రథముఁ దోలికొనుచు రణభూమి వెడలి వే
చనియె మూర్ఛదేఱి శంబరారి.
భావము:
నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=873
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment