Friday, December 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౩(413)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-878-ఉ.
సంచితభూరిబాహుబల శౌర్యుఁడు సారథిమాట కాత్మ మో
దించి యుదాత్తకాండ రుచిదీపితచాపముఁ దాల్చి మౌర్వి సా
రించి గుణధ్వనిన్ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో
లించె రథంబు మేదిని చలింపఁగ నా ద్యుముమీఁద నేర్పునన్.
10.2-879-వ.
అట్లు డగ్గఱి.
10.2-880-చ.
అరితను వష్ట బాణముల నాగ్రహవృత్తిఁ బగిల్చి నాల్గిటం
దురగములన్ వధించి యొక తూపున సారథిఁ ద్రుంచి రెంటని
ష్ఠురతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్ భయం
కరముగఁ ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్. 

భావము:
మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు. అలా శత్రువు ద్యుముడిని సమీపించి మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=880 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: