Friday, December 10, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౦(420)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-896-చ.
అనిన మురాంతకుండు దరహాసము మోమునఁ దొంగలింప సా
ల్వునిఁ గని "యోరి! లావు బలుపుంగల పోటరి వోలెఁ బ్రేలె దే
మనినను బాటు సన్నిహితమౌట యెఱుంగవు మూఢచిత్త! వొ
"మ్మని గదఁ గేలఁ ద్రిప్పి యభియాతిని శత్రుని వ్రేసె నుద్ధతిన్.
10.2-897-వ.
అట్లు వ్రేసిన.
10.2-898-క.
పెనుమూర్ఛ నొంది వెస ము
క్కున వాతను నెత్తురొల్కఁ గొంతవడికి నొ
య్యన తెలిసి నిలువరింపక
చనె వాఁడు నదృశ్యుఁ డగుచు సౌభముఁ దానున్.
10.2-899-వ.
అయ్యవసరంబున. 

భావము:
ఇలా అంటున్న సాల్వుడితో శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు. “ఓరోరి! మూర్ఖుడా! గొప్ప బలము, పరాక్రమం కల వీరుడిలా వాగుతున్నావు. నీకు చావు మూడిన సంగతిని గుర్తించలేకుండా ఉన్నావు.” అని పలికి తన గధాయుధాన్ని గిరగిర త్రిప్పి ఎదురుగా వస్తున్న సాల్వుడి మీదకు విసిరాడు. అలా శ్రీకృష్ణుడు గదను వేయగా శ్రీకృష్ణుని గదాఘాతంచేత సాల్వుడి నోటినుండి ముక్కునుండి రక్తం కారుతుండగా స్పృహ తప్పాడు. కొంతసేపటికి తేఱుకుని తెలివి తెచ్చుకున్నాడు. వెనువెంటనే సౌభకంతోపాటు అదృశ్యమయి. అలా సౌభకంతో సాల్వుడు అదృశ్యమై మాయలు పన్నిన ఆ సమయంలో... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=898 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: