Monday, December 13, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౩(423)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-905-వ.
తన మాయాబలంబునఁ గ్రమ్మఱం దోఁచి కృతక వసుదేవునిం గల్పించి యతనిం బంధించి కొనితెచ్చి “పుండరీకాక్ష! నిరీక్షింపు భవజ్జనకుండు వీఁడె; యిప్పుడు నీవు గనుంగొన వీని తలఁద్రుంతు నింక నెవ్వనికింగా మనియెదు? కావంగల శక్తిగలదేనిం గావు” మని దురాలాపంబు లాడుచు మృత్యుజిహ్వాకరాళంబైన కరవాలంబు గేలంబూని జళిపించుచు నమ్మాయావసుదేవుని శిరంబు దునిమి తన్మస్తకంబు గొని వియద్వర్తి యై చరియించు సౌభక విమానంబు సొచ్చె; నంత గోవిందుండు గొంతతడవు మనంబున ఘనంబగు శోకంబునం గుందుచుండి యాత్మసైనికులు దెలుపం దెలివొంది యది మయోదితంబైన సాల్వుని మాయోపాయం బని యెఱింగె; నంతం దనకు వసుదేవుండు పట్టువడె నని చెప్పిన దూతయు నమ్మాయాకళేబరంబును నా క్షణంబ విచిత్రంబుగా మాయంబై పోయె; ననంతరంబ. 

భావము:
ఆ దూత మళ్ళీ కనిపించి మాయావసుదేవుడిని కల్పించి, అతనిని బంధించి తీసుకు వచ్చి “ఓ కృష్ణా! పుండరీకముల వంటి కన్నులు ఉన్నాయి కదా చూడు. వీడే నీ తండ్రి నీ కన్నుల ముందే వీడి తల నరికేస్తాను. ఇక ఎవరి కోసం బ్రతుకుతావు? ఇక చాతనైతే రక్షించుకో.” అని దుర్భాషలు పలుకుతూ, భీకరమైన పెద్ద కత్తి జళిపిస్తూ, ఆ మాయావసుదేవుడి తల తరిగి, ఆ శిరస్సు పట్టుకుని సౌభకవిమానం లోనికి వెళ్ళిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణుడు కొంతసేపు బాగా దుఃఖంలో మునిగిపోయాడు. అప్పుడు తన సైనికులచే గుర్తు చేయబడి, అది సాల్వుడు ప్రయోగించిన మయ నిర్మిత మాయ అని కృష్ణుడు గ్రహించాడు. ఆ క్షణం లోనే వసుదేవుడు పట్టుబడ్డాడు అని చెప్పిన దూత, ఆ మాయాకళేబరం అదృశ్యం అయిపోయాయి. పిమ్మట.... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=905 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: