10.2-884-వ.
మఱియు నొక్కయెడ.
10.2-885-సీ.
ఖండిత శుండాల గండముల్ నక్రముల్-
భూరితుండంబులు భుజగ సమితి;
పదతలంబులు గచ్ఛపంబులు; దంతముల్-
శుక్తులు; గుంభనిర్ముక్త మౌక్తి
కములు రత్నములు; వాలములు జలూకముల్-
మెడలు భేకంబులు; మెదడు రొంపి;
ప్రేవులు పవడంపుఁ దీవెలు; నరములు-
నాఁచు; మజ్జంబు ఫేనంబు; లస్థి
10.2-885.1-ఆ.
సైకతములు; రక్తచయము తోయంబులు;
నొరగు నెడల నొరలు మొఱలు ఘన త
రంగరవముగా మతంగజాయోధన
స్థలము జలధిఁ బోల్పఁ దగె నరేంద్ర!
10.2-886-వ.
ఇవ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునఁ బరస్పర జయకాంక్షలం దలపడి పోరు పూర్వపశ్చిమ సముద్రంబుల వడువున నిరువదియేడు దినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంకొని కృష్ణుండు దారుకునిం జూచి యిట్లనియె.
భావము:
ఆ సంగ్రామరంగంలో ఆ సమయంలో.... ఓ రాజా! ఆ రణరంగం సముద్రంలా మారింది ఖండించబడిన ఏనుగుల గండస్థలాలే మొసళ్ళుగా; తొండాలే పాములుగా; ఆ యేనుగుల కాళ్ళు తాబేళ్ళుగా; దంతాలు ముత్యపుచిప్పలుగా; వాటి కుంభస్థలాల నుండి రాలిపడిన ముత్యాలు రత్నాలుగా; తోకలు జలగలుగా; మెడలు కప్పలుగా; మెదడు బురదగా; ప్రేగులు పగడపుతీగలుగా; నరాలు నాచుతీవలుగా; క్రొవ్వు నురుగులా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; రక్తము నీరుగా; మరణిస్తూ చేసే ఘీంకారాలు తరంగ శబ్దాలుగా; ఇలా ఆ రణభూమి సముద్రంతో పోల్చతగి పోలుపారింది. ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు దినాలు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=885
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment