10.2-908-క.
హరి దనమీఁద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ
వరు వధియింపఁ గోరి బహువారిద నిర్గతభూరివృష్టి వి
స్ఫురణ ననూన తీవ్రశరపుంజములన్ గగనంబుఁ గప్పి క్ర
చ్చఱ రిపు మౌళిరత్నమునుఁ జాపము వర్మముఁ ద్రుంచి వెండియున్.
10.2-909-మ.
వితతక్రోధముతోడఁ గృష్ణుఁడు జగద్విఖ్యాతశౌర్యక్రియో
ద్ధతశక్తిన్ వడిఁ ద్రిప్పి మింట మెఱుఁగుల్ దట్టంబుగాఁ బర్వ ను
గ్రతఁ జంచద్గద వైచి త్రుంచె వెసఁ జూర్ణంబై ధరన్ రాల నా
యతభూరిత్రిపురాభమున్ మహితమాయాశోభమున్ సౌభమున్.
భావము:
అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు. మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి త్రిపురాల వంటిదీ గొప్ప మాయతో విరాజిల్లుతున్నది అయిన సాల్వుడి సౌభకవిమానాన్ని తుత్తునియలు చేసాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=66&Padyam=909
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
: : భాగవతం చదువుకుందాం : :
No comments:
Post a Comment