Thursday, December 23, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౩౦(430)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-918-చ.
పెనుగదఁ బూన్చి కృష్ణుతల బెట్టుగ మొత్తిన నంకుశాహతిం
గనలెడి గంధసింధురముకైవడి సింధురభంజనుండు పెం
పున పవిభాసమానగదఁ బూని మహోగ్రతఁ ద్రిప్పి దంతవ
క్త్రుని యురముంబగిల్చినఁగుదుల్కొనుచున్రుధిరంబు గ్రక్కుచున్
10.2-919-వ.
తత్‌క్షణంబ పర్వతాకారంబగు దేహంబుతో నొఱలుచు నేలంగూలి కేశపాశంబులు సిక్కువడఁ దన్నుకొనుచుఁ బ్రాణంబులు విడిచె; నప్పుడు నిఖిల భూతంబులు నాశ్చర్యంబు వొందఁ దద్గాత్రంబున నుండి యొక్క సూక్ష్మతేజంబు వెలువడి గోవిందునిదేహంబుఁ బ్రవేశించె; నయ్యవసరంబున నగ్రజు మరణంబు గనుంగొని కుపితుండై కనుఁగవల నిప్పులుప్పతిల్ల విదూరథుండు గాలానల జ్వాలాభీలకరాళంబైన కరవాలంబును బలకయుం గేలందాల్చి దామోదరు దెసకుఁ గవయుటయుం గనుంగొని. 

భావము:
దంతవక్త్రుడు తన గదాదండంతో కృష్ణుడి తలమీద మోదాడు. అంకుశం పోటుకి కోపించెడి మదగజంలా, శ్రీకృష్ణుడు ఆగ్రహించి వజ్రాయుధంలాంటి గదతో వాడి వక్షస్థలాన్ని పగులకొట్టడంతో, వాడు రక్తం కక్కుతూ నేలకూలాడు. తక్షణమే పర్వతంవంటి దేహంతో దంతవక్త్రుడు నేలపడి శిరోజాలు విడివడి చిక్కులు పడేలా తన్నుకుంటూ ప్రాణాలు విడిచాడు. అప్పుడు, వాడి దేహం లోంచి ఒక సూక్ష్మతేజం వెలువడి శ్రీకృష్ణుడి శరీరంలో ఐక్యం అయింది. సకల జీవులూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో విదూరథుడు అను వాడు అన్న మరణం చూసి అతి కోపంతో ప్రళయకాలపు అగ్నిజ్వాలవంటి భయంకరమైన కత్తి, డాలు ధరించి శ్రీకృష్ణుడి పైకి దూకాడు. చక్రి అది చూసి..... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=919 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: