Wednesday, December 8, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౮(418)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-891-చ.
గురుభుజుఁ డంతఁ బోవక యకుంఠిత శూరత శత్రుసైన్యముల్‌
దెరలఁగ నుగ్రతం గొఱవిఁ ద్రిప్పిన కైవడి మింట దిర్దిరం
దిరుగుచు దుర్నిరీక్ష్యమగు దీపితసౌభము సాల్వుఁ జండభా
స్కర కిరణాభ షోడశ నిశాతశరంబులఁ గాఁడ నేసినన్.
10.2-892-చ.
కడు వడి నల్గి వాఁడు నిజకార్ముకమున్ జలదస్వనంబుకై
వడి మొరయించుచున్ వెడఁద వాతి శరంబులఁ బద్మలోచను
న్నెడమభుజంబు గాఁడ వడి నేసినఁ దెంపఱి చేతి శార్‌ఙ్గమున్
విడిచె రథంబుపై గగనవీథి సురల్‌ భయమంది చూడఁగన్. 

భావము:
మహాభుజబల సంపన్నుడు, వీరాధివీరుడు అయిన కృష్ణుడు అంతటితో శాంతించకుండా మొక్కవోని పరాక్రమంతో కొఱవి త్రిప్పుతున్నట్లు ఆకాశంలో గిరగిర తిరుగుతూ దుర్నరీక్ష్యంగా ఉన్న ఆ సౌభకాన్నీ అందులోని సాల్వుడిని తీక్షణమైన సూర్యకిరణాలతో సమానమైన పదహారు బాణాలను గుప్పించి నొప్పించాడు. సాల్వుడు కోపంతో తన ధనుస్సును మేఘగర్జనలా మ్రోగిస్తూ కృష్ణుని ఎడమ భుజంలో దిగబడేలా వాడి బాణాలు వేసాడు. అ దెబ్బకు కృష్ణుడు శార్ఙ్గము అనే పేరు కల తన ధనుస్సును రథంమీద జారవిడిచాడు. ఆకాశంలో దేవతలు భయపడుతూ చూడసాగారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=892 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: