Tuesday, December 21, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౯(429)

( దంతవక్త్రుని వధించుట) 
10.2-916-చ.
వడిఁ జనుదేరఁ జూచి యదువల్లభుఁ డుల్లము పల్లవింప న
ప్పుడు గదఁ గేలఁబూని రథమున్ రయమొప్పఁగ డిగ్గి యుగ్రతం
గడఁగి విరోధికిన్నెదురుగాఁ జన వాఁ డతినీచవర్తియై
యడరుచు నట్టహాసముఖుడై వలచే గదఁ ద్రిప్పుచున్ హరిన్.
10.2-917-వ.
కనుంగొని పరిహాసోక్తులుగా నిట్లనియె, “నీవు మదీయభాగ్యంబునం జేసి నేఁడు నా దృష్టిపథంబునకు గోచరుండవైతివి; మిత్రద్రోహివైన నిన్ను మాతులేయుండ వని మన్నింపక దేహంబు నందు వర్తించు నుగ్రవ్యాధి నౌషధాదిక్రియల నివర్తింపఁజేయు చికిత్సకుని చందంబున బంధురూపశాత్రవుండవు గావున నిన్ను దంభోళి సంరంభ గంభీరంబైన మదీయ గదాదండహతిం బరేత నివాసంబున కనిచి మున్ను నీచేత నిహతులైన నాదు సఖుల ఋణంబుఁ దీర్తు” నని దుర్భాషలాడుచు డగ్గఱి. 

భావము:
ఆ విధంగా తన మీదకి వస్తున్న దంతవక్త్రుడిని చూసిన శ్రీకృష్ణుడు వికసించిన హృదయంతో గద చేత పట్టి రథం దిగాడు. పూని ఉగ్రంగా విరోధికి ఎదురు నడిచాడు. దంతవక్త్రుడు అట్టహాసంగా గద త్రిప్పుతూ నీచంగా మురారిని ఎగతాళి చేస్తూ ఇలా అన్నాడు. “ఓ కృష్ణా! ఈనాడు నీవు నా భాగ్యవశం వలన నాకు ఎదురుగా కనపడ్డావు. నువ్వు బంధువు రూపంలో ఉన్న విరోధివి. శరీరంలో ప్రవేశించిన భయంకరవ్యాధిని మందులతో పోగొట్టే వైద్యుడిలా, మేనమామ కొడుకువు అనే అభిమానం లేకుండా వజ్రాయుధం లాంటి నా గదాయుధంతో మిత్రద్రోహివైన నిన్ను యమలోకానికి పంపిచేస్తాను. నిన్ను చంపి నీవు చంపిన నా మిత్రుల ఋణాన్ని తీర్చుకుంటాను.” అంటూ దంతవక్త్రుడు శ్రీకృష్ణుణ్ణి దుర్భాషలాడుతూ దగ్గరకు వచ్చి.. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=917 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: