Tuesday, December 14, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౪(424)

( శ్రీకృష్ణ సాల్వ యుద్ధంబు) 

10.2-906-క.
మును లపుడు గొంద ఱచటికిఁ
జనుదెంచి విమోహియైన జలజదళాక్షుం
గనుఁగొని సమధికభక్తిన్
వినయంబునఁ బలికి రంత విష్ణున్ జిష్ణున్.
10.2-907-సీ.
“కమలాక్ష! సర్వలోకములందు సర్వ మా-
  నవులు సంసార నానావిధైక
దుఃఖాబ్ధిమగ్నులై తుదిఁ జేరనేరక-
  వికలత్వమునఁ బొందు వేళ నిన్నుఁ
దలఁచి దుఃఖంబులఁ దరియింతు రట్టి స-
  ద్గుణనిధి వై దేవకోటికెల్లఁ
బట్టుగొమ్మై పరబ్రహ్మాఖ్యఁ బొగడొంది-
  పరమయోగీశ్వర ప్రకరగూఢ
10.2-907.1-తే.
పరచిదానంద దివ్యరూపమున వెలుఁగు
దనఘ! నీ వేడ? నీచజన్మాత్మ జనిత
ఘన భయస్నేహ మోహశోకంబు లేడ?"
ననుచు సంస్తుతి సేసి వారరిగి రంత. 

భావము:
ఆ సమయంలో, మునులు కొంతమంది వచ్చి, మాయా మోహితుడైన కృష్ణుడిని చూసి, చిక్కని భక్తితో వినయంగా సాక్షాత్తు విష్ణుమూర్తి అయిన వాడు, జయశీలుడు అయిన ఆయనతో ఇలా పలికారు. “ఓ పుండరీకాక్షా! పురుషోత్తమా! సమస్తమైన లోకాలలో ఉన్న మానవులు అందరు రకరకాలుగా సంసారం అనే దుఃఖసముద్రంలో మునిగి దరి చేరలేక కొట్టుమిట్టాడుతున్న దశలో నిన్ను స్మరించి ఆ దుఃఖాలను పోగొట్టుకొంటారు. అలాంటి సద్గుణాలకు నిధివై; దేవతాసమూహానికి ఆధారభూతుడవై; పరబ్రహ్మ స్వరూపుడవై; పరమయోగీశ్వరులకు కూడా అందనివాడవై; చిదానందరూపంతో ప్రకాశించే నీ వెక్కడ? అజ్ఞాన సంజాతాలు అయిన శోక, మోహ, భయాదు లెక్కడ? అవి నిన్ను అంట లేవు.” అని ఈ విధంగా ప్రస్తుతించి ఆ మునీశ్వరులు వెళ్ళిపోయారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=65&Padyam=907 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: