Friday, December 3, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౨(412)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-874-ఉ.
సారిథిఁ జూచి యిట్లనియె "శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ
దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం
కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్‌
బీరము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. "
10.2-875-వ.
అనిన నతం డతని కిట్లనియె.
10.2-876-క.
"రథి రిపుచే నొచ్చిన సా
రథియును, సారథియు నొవ్వ రథియును గావం
బృథుసమర ధర్మ; మిఁక న
వ్యధచిత్తుఁ డవగుచుఁ గడఁగు వైరుల గెలువన్."
10.2-877-వ.
అనిన విని. 

భావము:
సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.” ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి ఇలా అన్నాడు. “యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.” ఇలా సారథి చెప్పగా విని... 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=876 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: