Monday, December 20, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౨౮(428)

( దంతవక్త్రుని వధించుట) 

10.2-914-వ.
ఇట్లు మాయావి యైన సాల్వుండును సౌభకంబును గృష్ణుచేతం బొలియుటఁ గనుంగొని నిజసఖులగు సాల్వ పౌండ్రక శిశుపాలురకుఁ బారలౌకికక్రియలు మైత్రిం గావించి దంతవక్త్రుం డతి భీషణాకారంబుతో నప్పుడు.
10.2-915-చ.
పెట పెటఁ బండ్లు గీఁటుచును బెట్టుగ మ్రోయుచుఁ గన్నుగ్రేవలం
జిటచిట విస్ఫులింగములు సింద మహోద్ధతపాదఘట్టన
న్నటనిటనై ధరిత్రి వడఁకాడ వడిన్ గద కేలఁ ద్రిప్పుచున్
మిటమిట మండు వేసవిని మించు దివాకరుఁ బోలి యుగ్రతన్. 

భావము:
ఆ విధంగా శ్రీకృష్ణుడు సాల్వుడిని సౌభకవిమానాన్నీ ధ్వంసం చేయటం చూసిన దంతవక్త్రుడు తన మిత్రులైన సాళ్వ, పౌండ్రక, వాసుదేవ, శిశుపాలురకు ఉత్తరక్రియలు పూర్తి చేసి; మిక్కిలి భయంకరాకారంతో కృష్ణుడి మీదకు వచ్చాడు. పండ్లు పట పట కొరుకుతూ, కళ్ళనుండి నిప్పుకణాలు రాలుస్తూ, పాదఘట్టనలతో భూమివణికేలా అడుగులు వేస్తూ, గద గిరగిర త్రిప్పుతూ, ఎండాకాలపు సూర్యుడిలాగా మండిపడుతూ దంతవక్త్రుడు కృష్ణుడిని వచ్చి తాకాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=67&Padyam=915 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: