Tuesday, November 30, 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౦(410)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-869-క.
స్ఫురదనలాభశరంబులు
పొరిఁబొరి బుంఖానుపుంఖములుగా నేయం
దెరలియు మరలియు మురిసియు
విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్‌.
10.2-870-క.
అయ్యెడ మానము వదలక
డయ్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్
దయ్య మెఱుంగును? నెక్కటి
కయ్యం బపుడయ్యెఁ బేరుగల యోధులకున్.
10.2-871-క.
మును ప్రద్యుమ్నకుమారుని
ఘననిశితాస్త్రములచేతఁ గడు నొచ్చిన సా
ల్వుని మంతిరి ద్యుమనాముఁడు
సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్. 

భావము:
అప్పుడు, సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది. ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది. మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=870 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

No comments: