Wednesday, July 29, 2020

ఉషా పరిణయం - 57


( శివుడు కృష్ణుని స్తుతించుట )

10.2-444-క.
కరములు నాలుగు సిక్కం
బరిమార్చితి, వీఁడు నీదు భక్తుల కగ్రే
సరుఁడై పొగడొంది జరా
మరణాది భయంబు దక్కి మను నిటమీఁదన్."
10.2-445-వ.
అని యానతిచ్చిన నంబికావరుండు సంతుష్టాంతరంగుం డయ్యె; నబ్బలినందనుం డట్లు రణరంగవేదిం గృష్ణదేవతాసన్నిధిం బ్రజ్వలిత చక్రకృశాను శిఖాజాలంబులందు నిజబాహా సహస్ర శాఖా సమిత్ప్రచయంబును, దత్‌క్షతోద్వేలకీలాల మహితాజ్యధారాశతంబును, బరభయంకర వీరహుంకార మంత్రంబులతోడ వేల్చి పరిశుద్ధిం బొంది విజ్ఞానదీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించినవాఁడై యనవరతపూజితస్థాణుండగు నబ్బాణుండు, భుజవనవిచ్ఛేదజనితవిరూపితస్థాణుం డయ్యును దదీయవరదాన కలితానంద హృదయారవిందుం డగుచు గోవిందచరణారవిందంబులకుఁ బ్రణామంబు లాచరించి; యనంతరంబ.

భావము:
అందుచేతనే, ఇతనికి నాలుగు చేతులు మాత్రం ఉంచి, తక్కిన హస్తాలను ఖండించాను. ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసురుడుగా స్తుతింపబడుతూ, జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు.” ఈ మాదిరి శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు. బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుడి సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను రక్తధారలనే ఆజ్య ధారలతో హూంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడు అయ్యాడు. విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజగర్వమనే అంధకారం తొలగింది. నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడు అయిన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనసు నిండా ఆనందించాడు. గోవిందుడి పాదపద్మాలకు నమస్కారాలు చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=445

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: