Monday, July 13, 2020

ఉషా పరిణయం - 41

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-413-క.
జృంభణశరపాతముచే
శంభుఁడు నిజతనువు పరవశం బయి సోలన్
జృంభితుఁడై ఘననిద్రా
రంభత వృషభేంద్రు మూఁపురముపై వ్రాలెన్.
10.2-414-వ.
ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు నివ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె; నంత.
10.2-415-చ.
ఱిమి మురాంతకాత్మజుఁ డుదాత్తబలంబున బాహులేయుపైఁ
కరిఁ దాఁకి తీవ్రశితకాండ పరంపరలేసి నొంపఁగా
నెఱఁకులు గాఁడిపైఁ దొరఁగు నెత్తుటఁ జొత్తిలి వైరు లార్వఁగాఁ
చె మయూరవాహనముఁ బైకొని తోలుచు నాజిభీతుఁడై.

భావము:
ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు. శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు. ఆ సమయంలో ప్రద్యుమ్నుడు అనివార్య శౌర్యంతో కుమారస్వామిని ఎదుర్కున్నాడు. పట్టుదలతో తీవ్రమైన బాణాలను ప్రయోగించాడు. అంతట, నెత్తురు ముద్దగా మారిన కుమారస్వామి శత్రువులు సింహనాదాలు చేస్తుండగా యుద్ధరంగం నుండి పరాజితుడై నెమలివాహనం మీద వెనుదిరిగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=415

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 


No comments: