Saturday, July 25, 2020

ఉషా పరిణయం - 54


( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు )

10.2-439-వ.
అదియునుం బ్రచండమార్తాండమండల ప్రభావిడంబితంబును, భీషణ శతసహస్రకోటి దంభోళినిష్ఠురనిబిడనిశితధారాసహస్ర ప్రభూతజ్వలన జ్వాలికాపాస్త సమస్తకుటిల పరిపంథి దుర్వార బాహాఖర్వ గర్వాంధకారంబును, సకల దిక్పాల దేవతాగణ జేగీయమానంబును, సమదదానవజన శోకకారణ భయంకర దర్శనంబును, సమంచిత సజ్జనలోకప్రియంకర స్పర్శనంబును నగు సుదర్శనం బసురాంతక ప్రేరితంబై చని, యారామకారుండు కదళికా కాండంబుల నేర్చు చందంబునం బేర్చి సమద వేదండ శుండాదండంబుల విడంబించుచుఁ గనకమణివలయ కేయూర కంకణాలంకృతంబు నగు తదీయ బాహా సహస్రంబుఁ గరచతుష్ట యావశిష్టంబుగాఁ దునుము నవసరంబున.
10.2-440-తే.
కాలకంఠుఁడు బాణుపైఁ గరుణ గలఁడు
గాన నఖిలాండపతిఁ గృష్ణుఁ గదియవచ్చి
పురుషసూక్తంబు సదివి సంపుటకరాబ్జుఁ
డగుచుఁ బద్మాయతాక్షు నిట్లని స్తుతించె.

భావము:
సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలంలా శోభించేది; పదివేలకోట్ల వజ్రాయుధాల జ్వలన జ్వాలలతో శత్రువుల గర్వాంధకారాన్ని నివారించేది; సమస్త దేవతల స్తుతులను అందుకునేది; తన దర్శనంతో దానవులకు శోకం కలిగించేదీ; తన సంస్పర్శనంతో సజ్జనులకు ఆనందం కలిగించేదీ. శ్రీ కృష్ణుడు అట్టి సుదర్శనాన్ని బాణాసురుడి మీద ప్రయోగించగా, అది రత్నఖచితా లైన ఆభరణాలతో శోభిస్తూ, మదగజతుండాలలాగ వెలుగొందుతున్న బాణాసురుని వేయిచేతులలో నాల్గింటిని మాత్రం వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిచెట్లను నరకివేసినట్లు నరికేసింది. పరమేశ్వరుడికి బాణాసురుడంటే ఎంతో దయ. అందుచేత, ఆయన అతనిని రక్షించడం కోసం లోకనాయకు డైన శ్రీకృష్ణుడి వద్దకు వచ్చి, పురుషసూక్తం పఠించి, నమస్కరించి, పద్మాక్షుడిని ఇలా స్తుతించాడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=439

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: