Friday, July 17, 2020

ఉషా పరిణయం - 49

( మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు ) 

10.2-430-వ.
అదియునుం గాక లోకంబున దైవం బనేక ప్రకారంబులై యుండు; నది యెట్టిదనినం గళాకాష్ఠాముహూర్తంబులనంగల కాలంబును, సుకృత దుష్కృతానుభవ రూపంబు లైన జీవకర్మంబులును స్వభావంబును, సత్త్వరజస్తమోగుణాత్మకంబైన ప్రకృతియును, సుఖదుఃఖాశ్రయంబైన శరీరంబును, జగజ్జంతు నిర్వాహకంబైన ప్రాణంబును, సకలపదార్థ పరిజ్ఞాన కారణం బైన యంతఃకరణంబును, మహదహంకార శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్ర తత్కార్యభూత గగన పవ నానల సలిల ధరాది పంచభూతంబు లాదిగాఁ గల ప్రకృతి వికారంబులును, నన్నింటి సంఘాతంబును, బీజాంకుర న్యాయంబునం గార్యకారణరూప ప్రవాహంబును నై, జగత్కారణ శంకితం బై యుండు; నది యంతయు భవదీయ మాయా విడంబనంబు గాని యున్నయది కాదు; తదీయ మాయానివర్తకుండవైన నీవు నానావిధ దివ్యావతారాదిలీలలం జేసి దేవగణంబులను, సత్పురుషులను, లోకనిర్మాణచణులైన బ్రహ్మాదులను బరిరక్షించుచు లోకహింసాప్రవర్తకులైన దుష్టమార్గ గతులం గ్రూరాత్ముల హింసించుచుందువు; విశ్వ! విశ్వంభరాభార నివారణంబు సేయుటకుఁ గదా భవదీయ దివ్యావతార ప్రయోజనంబు; గావున నిన్ను శరణంబు వేఁడెద.

భావము:
ఓ దేవా! లోకంలో భగవంతుడు అనేక రీతులలో గోచరిస్తాడు. ముహూర్తము మున్నగు రూపాలలో తెలియబడు కాలంగాను; సుకృతాలు దుష్కృతాల రూపంలోను జీవకర్మలుగాను, స్వభావాలుగాను; త్రిగుణాత్మకమైన ప్రకృతిగాను; సుఖదుఖాలకు ఆశ్రయం అయిన శరీరంగానూ; జీవకోటికి ఆధారమైన ప్రాణంగాను; పదార్థాల గురించిన జ్ఞానాన్ని అందించే అంతఃకరణంగాను; మహత్తుగాను, అహంకారంగాను, పంచతన్మాత్రలుగాను, వాటి కారణభూతములు ఐన పంచభూతాలుగానూ; వీటి అన్నింటి సంఘాతంగాను; బీజాంకుర న్యాయంతో కార్యకారణరూప మైన ప్రవాహమై; ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. కానీ, ఇది అంతా నీ మాయయే తప్ప వాస్తవం కాదు. ఆ మాయను నివారించగలవాడ వైన నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోకనిర్మాణ చణులైన బ్రహ్మాదిదేవతలనూ, పుణ్యపురుషులనూ, దేవగణాలనూ రక్షిస్తూ హింసారూప మైన చెడుమార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తూ ఉంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం అందువలన నిన్ను శరణు కోరుతున్నాను.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=38&padyam=430

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments: