Saturday, July 11, 2020

ఉషా పరిణయం - 38


( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-405-చ.
జలరుహనాభుఁ డార్చి నిజ శార్‌ఙ్గ శరాసన ముక్త సాయకా
వలి నిగుడించి నొంచెఁ బురవైరి పురోగములన్ రణక్రియా
కలితుల గుహ్యకప్రమథ కర్బుర భూతపిశాచ డాకినీ
బలవ దరాతియోధులను బ్రమ్మెరపోయి కలంగి పాఱఁగన్.
10.2-406-వ.
ఇట్లేసి యార్చిన కుంభినీధరు భూజావిజృంభణ సంరంభంబునకు సహింపక, నిటలాంబకుం డనలకణంబు లుమియు నిశితాంబకంబులం బీతాంబరునినేసిన, వానినన్నింటి నడుమన ప్రతిబాణంబు లేసి చూర్ణంబు సేసినం గనుంగొని మఱియును.

భావము:
శ్రీకృష్ణుడు సింహనాదంచేసి శార్జ్గమనే తన ధనస్సును ఎక్కుపెట్టి, బాణవర్షాన్ని కురిపించి, యుద్ధవిశారదు లైన ప్రమథగణాలనూ, భూత, పిశాచ, ఢాకినీ వీరులను దిగ్భ్రాంతి చెంది పారిపోయేలా చేసాడు. ఇలా బాణప్రయోగం చేసి విజృంభించిన శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని సహించలేక, పరమేశ్వరుడు నిప్పులు క్రక్కే శరపరంపరలను పీతాంబరుడైన కృష్ణుడిమీద ప్రయోగించాడు. ఆ బాణాలు అన్నింటిని, మధ్యలోనే శ్రీకృష్ణుడు చూర్ణం చేసాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=406

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: