Tuesday, July 14, 2020

ఉషా పరిణయం - 43

( శివ కృష్ణులకు యుద్ధ మగుట )

10.2-418-వ.
అట్టియెడ సైన్యంబు దైన్యంబు నొంది యనాథం బయి చెడి, విఱిగి పాఱినం గని బాణుండు సాత్యకిం గేడించి ప్రళయాగ్నియుం బోలె విజృంభించి చెయి వీచి బలంబుల మరలం బురిగొల్పి తానును ముంగలి యై నడచె; నప్పు డుభయసైన్యంబు లన్యోన్య జయకాంక్షం దలపడు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున వీఁకం దాఁకినం బోరు ఘోరం బయ్యె; నట్టియెడ గదల నడిచియుఁ, గుఠారంబులఁ బొడిచియు; సురియలం గ్రుమ్మియు, శూలంబులం జిమ్మియు; శక్తుల నొంచియుఁ, జక్రంబులం ద్రుంచియు, ముసలంబుల మొత్తియు, ముద్గరంబుల నొత్తియుఁ; గుంతంబుల గ్రుచ్చియుఁ, బంతంబు లిచ్చియుఁ; బరిఘంబుల నొంచియుఁ, బట్టిసంబులం ద్రుంచియు శరంబుల నేసియుఁ, గరవాలంబుల వ్రేసియు, సత్రాసులై పాసియు, విత్రాసులై డాసియుఁ బెనఁగినం దునిసిన శిరంబులును, దునుకలైన కరంబులును, దెగిన కాళ్ళును, ద్రెస్సిన వ్రేళ్ళును; దుమురులైన యెముకలును, బ్రోవులైన ప్రేవులును, నులిసిన మేనులును, నలిసిన జానువులును, నొగిలిన వర్మంబులును, బగిలిన చర్మంబులును, వికలంబు లయిన సకలావయవంబులును, వికీర్ణంబులయిన కర్ణంబులును, విచ్ఛిన్నంబులైన నయనంబులును, వెడలు రుధిరంబులును, బడలుపడు బలంబులును, గొండల వడువునంబడు మాంసఖండంబులును, వాచఱచు కొఱప్రాణంబులును, వ్రాలిన తేరులును,గూలిన కరులును, నొఱగిన గుఱ్ఱంబులును, దెరలిన కాలుబలంబులును గలిగి; పలలఖాదన కుతూహల జనిత మదాంధీభూత పిశాచ డాకినీ భూత బేతాళ సమాలోల కోలాహల భయంకరారావ బధిరీకృత సకలదిశావకాశం బయి సంగరాంగణంబు భీషణంబయ్యె; నయ్యవసరంబున.

భావము:
ఆ సమయంలో, బాణుడి సైన్యం దీనత్వంతో అనాథ యై, పారిపోసాగింది, అది చూసి బాణాసురుడు సాత్యకిని అలక్ష్యం చేసి ప్రళయాగ్ని వలె విజృంభించి తన సైన్యాన్ని పురికొల్పి తానే సేనకు నాయకత్వం వహించాడు. అప్పుడు ఉభయసైన్యాలూ అన్యోన్య జయకాంక్షతో తలపడిన ఉత్తర దక్షిణ సముద్రాలవలె విజృంభించి యుద్ధానికి సిద్ధపడ్డాయి. సంకులయుద్ధం సాగింది. గదలు, ఖడ్గాలు, సురియలు, శూలాలు, చక్రాలు, శక్తులు, బల్లెములు, పట్టిసములు మున్నగు ఆయుధాలతో ఇరుపక్షాల సైనికులు యుద్ధం చేసారు; కొందరు భయంతో పారిపోయారు; కొందరు ధైర్యంతో ఎదిరించారు; కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగిపోయాయి; ఎముకలు ముక్కలు అయ్యాయి; ప్రేగులు కుప్పలు పడ్డాయి; చెవులు తెగిపోయాయి; కళ్ళు విచ్ఛిన్నమయ్యాయి; మాంసఖండాలు కొండలవలె యుద్ధరంగంలో పడ్డాయి; రథాలు కుప్పకూలాయి; గజాలు నేలవ్రాలాయి; గుఱ్ఱాలు కూలబడ్డాయి; కాల్బలం మట్టికరచింది; యుద్ధరంగంలో పడిన ఈ శవాల మాంసాన్ని భక్షించడానికి గుమికూడిన భూత, పిశాచ, బేతాళుల భయంకర ధ్వనులతో సకల దిశలు మారుమ్రోగాయి. ఆ రణరంగం ఈతీరున మహాభీషణమై ఘోరాతిఘోరంగా మారిపోయింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=37&padyam=418

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: