Sunday, July 26, 2020

ఉషా పరిణయం - 55

( శివుడు కృష్ణుని స్తుతించుట ) 

10.2-441-వ.
“దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు; నిఖిల వేద వేదాంత నిగూఢుండవు; నిర్మలుండవు; సమానాధిక రహితుండవు; సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిది నవలోకింతు; రదియునుంగాక పంచోపనిషన్మయం బయిన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుఁడును, బాదంబుల వసుంధరయు, నాత్మ యందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీ వ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు, నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయ దివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు; యద్వితీయుండవు; పురాణపురుషుండవు; సకల సృష్టి హేతుభూతుండవు; నీశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచు విధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండవయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేక రూపుండ వై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితులయిన జీవులు పుత్త్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్తగర్తంబుల మునుంగుచుందేలుచుందురు; దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేరనెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుండనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండ వైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబుమాని హాలాహలంబుసేవించుట గాదె? జగదుదయపాలన లయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండ వై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణు లైన ముని గణంబులును భజియించుచుందుము; మఱియును.

భావము:
“దేవా! నీవు బ్రహ్మస్వరూపుడవు; జ్యోతిర్మయుడవు; సమస్త వేదవేదాంత నిగూఢుడవు; నిర్మలుడవు; నీతో సమానమైనవాడు అధికుడు మరొకడు లేడు; సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలాగ దర్శిస్తారు. నీవు పంచోపనిషన్మయంబైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించు నపుడు; నాభి యందు ఆకాశాన్ని, ముఖంలో అగ్నినీ, శిరస్సున స్వర్గాన్నీ, చెవులలోదిక్కులనూ, నేత్రాలలో సూర్యుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, పాదాలలో భూమినీ, ఆత్మలో అహంకారాన్నీ, కడుపులో సముద్రాలనూ, రేతస్సులో నీటినీ, భుజాలలో దేవేంద్రుణ్ణీ, వెంట్రుకలలో వృక్షౌషధీ విశేషాలనూ, శిరోజాలలో బ్రహ్మలనూ, జ్ఞానంలో సృష్టినీ ప్రజాపతులనూ, హృదయంలో ధర్మాన్నీ వహించిన మహా పురుషుడవు. అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి జగత్కల్యాణం నిమిత్తం అవతారం దాల్చావు. అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్తుతించడం ఎవరికి సాధ్యం అవుతుంది. నీవు సమస్త సృష్టికి మూలకారకుడవు; అద్వితీయుడవు; పురాణపురుషుడవు; సూర్యుడు మేఘమాలచేత కప్పబడి భిన్నరూపాలతో కనిపించే విధంగా అఘటితఘటనాఘటన సమర్ధమైన సంకల్పంతో త్రిగుణాతీతుడవై కూడా అనేక రూపాలతో గోచరిస్తుంటావు; సత్పురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తుంటావు నీ మాయకు లోనైన జీవులు సంసారమనే సముద్రపు సుడిగుండంలో మునిగితేలుతూ ఉంటారు; నీ దివ్యరూపాన్ని దర్శించకుండా నీ పాదకమలపూజ చేయకుండా ఇంద్రియలోలుడై ఉండు మూఢుడు ఆత్మవంచకుడు అనబడతాడు; నిన్ను ధ్యానించకుండా విపరీతబుద్ధితో ఇంద్రియలోలుడు కావటం అమృతాన్ని వదలి హాలాహలం సేవించడం; సృష్టి స్థితి లయకారకుడవై శాంతుడవై, సజ్జన భాగధేయుడవై, అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాదిదేవతలూ మహామునీంద్రులూ నేనూ భజిస్తూ ఉంటాము. అంతేకాదు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=39&padyam=441

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments: